Mahaa Daily Exclusive

  శంషాబాద్‌లో కలకలం… తెల్లటి సంచిలో రెండ్రోజుల పసికందు….

Share

రంగారెడ్డి, మహా.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డుపై తెల్లటి సంచిలో రెండ్రోజుల ఆడ శిశువు లభ్యమవడం కలకలం రేపింది. పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రోడ్డుపై సంచి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పసికందును సురక్షితంగా బయటకు తీసి శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శిశువుకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని అమీర్‌పేటలోని శిశు విహార్ సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం శిశువు వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పసికందును అక్కడ వదిలి వెళ్లిన వారిని గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. శిశువును నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలివెళ్లిన నిందితులను త్వరలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు చిన్నారుల భద్రత, తల్లిదండ్రుల బాధ్యతలపై మరోసారి చర్చకు దారితీసింది.