ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం.
* వాజేడులో అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచివేత.
* వరదలకు కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు.
* 25 గ్రామాలకు రవాణా స్తంభింపు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండగా, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పర్యాటకులను నీటి కొలనులోకి అనుమతించడం లేదు. దూర ప్రాంతాల నుంచి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు కేవలం వీక్షణకే పరిమితం కావాల్సి రావడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వాజేడు మండలంలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్–భూపాలపట్నం 163వ జాతీయ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో చీకుపల్లి గ్రామం వద్ద పాత వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక డైవర్షన్ అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ మధ్య అంతర్రాష్ట్ర రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
డైవర్షన్ రోడ్డు దెబ్బతినడంతో వాజేడు మండల పరిధిలోని సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో గ్రామస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రోచ్ రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించినప్పటికీ వరద ఉధృతి తగ్గకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
ఇక మంచిర్యాల జిల్లాలో కూడా భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నూర్ మండలం అక్కేపల్లి గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కేపల్లి–శివలింగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంపై ఆధారపడే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులను లేదా తెలంగాణ విపత్తు నిర్వహణ విభాగాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు వాహనదారులు, గ్రామస్థులు వరద నీటిని దాటేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.








