దేవాదులపై కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం.
* ఇది ప్రకృతి కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు.
* 3.17 లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడకపోతే ప్రజాపోరాటం తప్పదు.
* మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు.
హైదరాబాద్, మహా.
దేవాదుల ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ప్రకృతి సృష్టించిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్యం, అసమర్థతతో తెచ్చిన కరువని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవాదుల వద్ద నీటి లభ్యత సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే పంపులు నడపకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
జూలై 12న దేవాదుల పంపులను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీశామని, ఆ మరుసటి రోజే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్లి హడావుడిగా ప్రకటనలు చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. దేవాదుల కింద ఉన్న 22 రిజర్వాయర్లను నింపి, 38 టీఎంసీల నీటిని ఎత్తుతామని ప్రకటించడంతో రైతులు ఆ మాటలు నమ్మి నారు పోసుకున్నారని, కానీ ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
దేవాదుల పథకం కోసం కేసీఆర్ ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీ నిర్మించి, మూడు దశలను పూర్తి చేసి నీళ్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉంచిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం సమ్మక్క బ్యారేజీలో మూడు టీఎంసీల నీటి నిల్వతో పాటు 22 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని, అయినా ప్రభుత్వం నీటిని ఎత్తకుండా చూస్తూ కూర్చోవడం దారుణమని అన్నారు. జూలై 13 నుంచి పది పంపులు నడుపుతామని ప్రకటించిన ప్రభుత్వం, వాస్తవానికి నిన్నటి వరకు ఐదు పంపులు మాత్రమే నడిపిందని, మంత్రులు వచ్చినప్పుడు ఏడు మోటార్లు, వారు వెళ్లిపోయాక మూడు మోటార్లకే పరిమితం చేశారని ఆరోపించారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా శాయంపేట, భీమదేవపల్లి, ఎల్కతుర్తి సహా అనేక ప్రాంతాల్లో రైతులు నీటి కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, నీళ్లు ఉండి కూడా ఎత్తకపోవడం వెనుక ప్రభుత్వ వైఖరి ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ అడ్డంకి లేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు దేవాదుల వద్ద పంపులు పూర్తి స్థాయిలో ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేయడమే ప్రభుత్వ లక్ష్యమా అని నిలదీశారు.
దేవాదుల కింద గత ఏడాది రూ.8 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపులు 50 రోజుల ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, దాంతో రూ.700 నుంచి రూ.800 కోట్ల విలువైన పంటలు ఎండిపోయాయని హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రపంచ దేశాలన్నీ ప్రతి నీటి బొట్టును ఒడిసిపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోదావరి నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేస్తోందని అన్నారు.
రామప్ప, పాకాల ఆయకట్టుల కింద వేలాది ఎకరాల్లో రైతులు మంత్రుల హామీలను నమ్మి నాట్లు వేయగా, మరోవైపు వరంగల్ కలెక్టర్ మాత్రం అఖిలపక్ష సమావేశంలో నీళ్లు ఇవ్వలేమని, నాట్లు వేయొద్దని చెప్పడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. మంత్రుల మాట నిజమా, కలెక్టర్ మాట నిజమా అని ప్రశ్నించిన ఆయన, రామప్ప తూములు మూసివేయడం వల్ల ఇప్పటికే నాట్లు వేసిన రైతుల పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.
రైతులు బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లు, బిందెలతో పంటలకు నీళ్లు మోస్తున్న దయనీయ పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి కనిపించడం లేదని హరీశ్ రావు విమర్శించారు. రైతులకు ఉన్న తపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని, గ్యారెంటీల అమలులో వాయిదాలు వేసినట్లే సాగునీటి విషయంలో కూడా వాయిదాల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో రోజూ విమర్శలు చేసే ప్రభుత్వం దేవాదుల వద్ద ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 రోజులు గడిచినా నీటిని పూర్తి స్థాయిలో ఎత్తకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2011లో కూలిపోయిన దేవాదుల టన్నెల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఎల్‌నినో పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరించారు.
సమ్మక్క బ్యారేజీ నుంచి ఇప్పటివరకు 105 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లిపోయిందని, కానీ ప్రభుత్వం ఎత్తింది కేవలం 1.9 టీఎంసీల నీరేనని హరీశ్ రావు ఆరోపించారు. రోజుకు పావు టీఎంసీ చొప్పున ఎత్తే అవకాశం ఉన్నా, కనీసం రెండు టీఎంసీలు కూడా ఎత్తలేకపోయిందని అన్నారు. 22 రిజర్వాయర్ల సామర్థ్యం 12 టీఎంసీలని, ఈ 50 రోజుల్లో అవన్నీ నింపే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది సాధ్యపడలేదని విమర్శించారు.
జనగాం, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టంగా చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ మీడియా సమావేశం ఉందని తెలిసిన తర్వాతే ఉదయం మరో రెండు మోటార్లు ప్రారంభించారని, ప్రతిపక్షం నిలదీస్తేనే ప్రభుత్వం కదులుతోందని వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫరా, నిధులు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ వంటి అంశాల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేయడం వల్లే రైతులు నష్టపోయారని, ఆ సమయంలో కేవలం 46 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందిందని హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో 3.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టును సస్యశ్యామలం చేసిందని చెప్పారు. వైరా, బేతుపల్లి ప్రాంతాలకు నేడు నీళ్లు చేరుతున్నాయంటే అది కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలితమేనని పేర్కొన్నారు.
కాళేశ్వరం పేరుతో రాజకీయ విమర్శలు చేయడం మానేసి దేవాదులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హరీశ్ రావు సూచించారు. సమ్మక్క బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే తరహా డిజైన్‌లో ఉన్నప్పుడు దేవాదుల అవసరాలకు వాటిని ఎందుకు పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి వెంటనే పది మోటార్లు నడిపి, 22 రిజర్వాయర్లను నింపి, 3.17 లక్షల ఎకరాలకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజాపోరాటానికి శ్రీకారం చుడతామని హరీశ్ రావు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రాజయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.








