హైదరాబాద్, జూలై 21:
రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క)కు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన నిరాహార దీక్షకు సంబంధించి ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన మంగళవారం విచారించి, ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న చర్యలను, కేసులో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. దీంతో సీసీ నెం.308/2024లో సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణకు ముగింపు పలికింది.
2021 ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ పథకంలో కొవిడ్ చికిత్సను చేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకోలేదని, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ గాంధీనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 188, 269, 270తో పాటు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బి) కింద కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయగా, ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు దానిని స్వీకరించి విచారణ కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో సీతక్క హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసు చట్టబద్ధం కాదని, కేసు స్వీకరణ నుంచే న్యాయపరమైన లోపాలు ఉన్నాయని పిటిషన్‌లో వాదించారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు విచారణకు సంబంధిత ప్రజాసేవకుడు లేదా అతని పైఅధికారి నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వక ఫిర్యాదు ఉండాల్సి ఉంటుందని, కానీ ఈ కేసులో కేవలం పోలీసుల ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే కోర్టు విచారణ ప్రారంభించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అలాగే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బి) కింద కూడా అవసరమైన చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించలేదని, సెక్షన్ 60 ప్రకారం అధికారం కలిగిన వ్యక్తి ఫిర్యాదు చేయకపోవడంతో విచారణ కొనసాగించడానికి అవకాశం లేదని వాదించారు.
అంతేకాకుండా ఐపీసీ సెక్షన్లు 269, 270 వర్తించాలంటే నిందితుడి చర్యల వల్ల అంటువ్యాధి వ్యాపించే అవకాశం లేదా వ్యాప్తికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉండాలని, కానీ తనపై అలాంటి ఆరోపణలు గానీ, ఆధారాలు గానీ లేవని సీతక్క తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేవలం శాంతియుత నిరసనలో పాల్గొన్నందుకు ఈ నేరాలు వర్తించవని, సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని వాదించారు.
వాదనలు పరిశీలించిన జస్టిస్ సుజన, సీతక్కపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడానికి చట్టపరమైన ఆధారం లేదని నిర్ధారిస్తూ, కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి కేసును కొట్టివేశారు.








