Mahaa Daily Exclusive

  గడువు పొడిగింపు లేదు…

Share

గడువు పొడిగింపు లేదు.
* ఎన్యూమరేషన్ ఫామ్‌లు వెంటనే బీఎల్‌వోలకు ఇవ్వాలి.
* జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.

హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు ఇకపై గడువు పొడిగింపు ఉండబోదని జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫామ్‌లు తీసుకున్న ఓటర్లు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) అందజేయాలని సూచించారు.

చాలా మంది ఓటర్లు ఆగస్టు 3 వరకు గడువు ఉందని భావించి ఫామ్‌ల సమర్పణను వాయిదా వేస్తున్నారని, అయితే అందిన ఫామ్‌లన్నింటినీ డిజిటలైజేషన్ చేయాల్సి ఉండటంతో చివరి రోజుల్లో భారీ ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని కర్ణన్ తెలిపారు. చివరి రోజు వరకు వేచి ఉంటే సర్వర్‌పై అధిక భారం పడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. అందువల్ల ఆలస్యం చేయకుండా వెంటనే ఫామ్‌లు సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ జిల్లాలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫామ్‌లను సేకరిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు సార్లు కూడా ఇంటింటికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో 9.59 శాతం మంది ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్‌లు సమర్పించారని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 43 శాతం ఎన్యూమరేషన్ ఫామ్‌లు అందాయని, వాటి వివరాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్లు పేర్కొన్నారు.

ఓటర్లను భయపెట్టి లేదా తప్పుడు ప్రచారం చేసి ఎన్యూమరేషన్ ఫామ్‌లు సమర్పించకుండా అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. ఓటు హక్కుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఓటు హైదరాబాద్‌లో ఉన్నా, గ్రామంలో ఉన్నా సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని (ఏఈఆర్‌ఓ) ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన మరికొందరు బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. బీఎల్‌వోలు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించేందుకు విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆర్వీ కర్ణన్ తెలిపారు.