Mahaa Daily Exclusive

  బుల్లి తెరకు మహర్ధశ….

Share

  • బుల్లి తెరకు మహర్ధశ
  • టీవీ ఆర్టిస్టుల అవార్డులకు సర్కార్ ఆలోచన
  • పీవీ పేరును పరిశీలిస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, మహా : బుల్లితెర (టెలివిజన్) రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తొలిసారిగా టెలివిజన్ రంగానికి రాష్ట్ర స్థాయి అవార్డులను అందించే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో టెలివిజన్ అవార్డు కమిటీతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం సమావేశమై అవార్డుల రూపకల్పనపై కీలక చర్చలు జరిపారు. అవార్డుల లోగో, పేరు, కేటగిరీలు, ఎంపిక విధానం వంటి అంశాలపై కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. అవార్డుల పేరు, లోగో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని హితవు పలికారు. మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు పేరును ఈ టీవీ అవార్డులకు పెట్టాలని కమిటీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ అవార్డుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదంతో పాటు సామాజిక సందేశాలను కూడా టెలివిజన్ రంగం అందిస్తోందని పేర్కొన్నారు. నటీనటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, యాంకర్లు, నిర్మాతలు, బాలల కార్యక్రమాలు, సామాజిక సందేశంతో కూడిన సీరియల్స్ వంటి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేలా కేటగిరీలను రూపొందించాలని కమిటీకి మంత్రి సూచించారు.

ఈ టీవీ అవార్డుల ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రతిష్ఠకు తగ్గట్టుగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం 2 లేదా 3 వేదికలను ప్రతిపాదించాలని మంత్రి కమిటీ సభ్యులను కోరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీవీ రంగంలో మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని.. అందువల్ల ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ముకుంద్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అవార్డుల మార్గదర్శకాలు, లోగో, పేరు, కేటగిరీలను త్వరగా ఖరారు చేయాలని ఆదేశించారు.