•ఇన్వెస్ట్ తెలంగాణ ప్రధాన ధీమ్ గా
•డిసెంబర్ 7,8,9 తేదీలలో
•తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0
•కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
•భారీ పెట్టుబడుల సదస్సు
హైదరాబాద్, మహా : తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. గతేడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కంటే ఈసారి మరింత విస్తృత స్థాయిలో సదస్సును నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ ప్రధాన థీమ్‌గా.. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు వివరించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సదస్సు ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆకర్షించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రణాళికను కూడా గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచానికి పరిచయం చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు, మౌలిక వసతుల అవకాశాలను పెట్టుబడిదారుల ముందుంచేలా ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, తయారీ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు ప్రదర్శించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, స్టార్టప్‌ల విజయాలను కూడా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వివిధ రంగాల్లో తెలంగాణకు చెందిన సంస్థలు, స్టార్టప్‌లు సాధించిన విజయాలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శించే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0లో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులను తీసుకురావడం, పరిశ్రమల విస్తరణకు అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను ఒకే వేదికపై ప్రదర్శించడం ద్వారా కొత్త పెట్టుబడి ప్రతిపాదనలకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.







