- సమస్యలపై స్పందించక పోవడంపై ఆగ్రహం.
- గ్రౌండ్ రియాలిటీ తో పని చేయకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరిక.
- ఎప్పుడో కట్టుకున్న ఇళ్లపై తాజాగా పెట్టిన ఆంక్షలా
- వెంటనే ఎత్తివేసేలా చూడాలని మంత్రులను కోరిన ఎంపీ
- డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచన.
హైదరాబాద్, మహా : మేడ్చల్ – మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సమీక్ష సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, రెవెన్యూ చాలా కాంప్లికేటేడ్ సబ్జెక్టు అయ్యిందని, ప్రభుత్వ భూములతో పాటుగా ఇనాం భూములు, భూదాన్ భూములు ఇతర అన్నిరకాల భూ సమస్యలు పరిష్కారం అందించాలన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్న వారిపై విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలన్నారు. నలభై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకున్న వారికి రిలీఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరగా దీనికి పరిష్కారం అందించాలని మంత్రులను కోరారు. బస్తీలలో నివసించేవారు 60 – 70 గజాల్లో ఇల్లు కట్టుకొని ఉంటున్న పేదవారు. పేద ప్రజల కోసం అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలని సూచించారు. గత రెండున్నర సంవత్సరాలుగా మల్కాజిగిరిలో ఉన్న ప్రతి బస్తీ తిరుగుతున్నానని, ఇక్కడున్న సమస్యలన్నిటి మీద పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నానన్నారు.
గతంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే అధికారులు స్పందించేవారు కానీ ఇప్పుడు స్పందించడం లేదని మండిపడ్డారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని సూచించారు. జీవో నెంబర్ 59 లో ఉన్న సమస్యలు తీర్చాలని, ఎల్లమ్మబండలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో 176 ఎకరాల భూమిని పేదలకు, జర్నలిస్టులకు భూమి ఇచ్చారు, అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అదే సర్వే నంబర్ లో 92 ఎకరాల భూమిని ప్రభుత్వ సపోర్టుతో సుప్రీంకోర్టులో గెలిచి భూమి మీద హక్కులు తెచ్చుకున్న కబ్జాదారులు స్మశాన వాటికలను కూడా కూల్చివేశారన్నారు. చట్టం ఉన్నవారే చట్టంగా మారిందని అక్కడ వారు మాట్లాడుతున్నారన్నారు. హైడ్రా కాపాడాల్సిన భూములను వదిలిపెట్టి, పేద వారిని ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ లో ఉచితంగా 10 ఎకరాలు ఇచ్చిన మనలాంటి వాళ్ళం ఇల్లు కట్టుకోలేమని, అక్కడ ఉన్నవాళ్లంతా కడుపేదలు. ఎటు పోలేక బ్రతుకుతున్నవారు. కట్టుకున్న చిన్నచిన్న ఇళ్లను అధికారులు వచ్చి కూల్చి వేస్తూ లంచాలతో వేధిస్తున్నారన్నారు. దేవరయాంజాల్ భూములు సమస్య కూడా త్వరగా పరిష్కారం చేయాలని, బ్రోకర్లు బాగుపడుతూ అసలైన రైతులు నష్టపోతున్నారని వాపోయారు. జవహర్ నగర్ లో హిందూ శ్మశానవాటిక కోసం భూమిని నరసింహ రెడ్డి అనే రైతు దానం చేస్తే.. ఆ భూమిని రాంకీ సంస్థ ఆక్రమించుకొని చెత్త వేస్తుందని తెలిపారు.
అల్వాల్ కూరగాయల మార్కెట్ తొలగిస్తున్నారని, దానిమీద ఆధారపడి బ్రతుకుతున్న పేదల జీవితాలు ఆగం కాకుండా ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు స్థానికమైన వారికి కాకుండా యాకుత్ పురా, డబిల్ పురా వారికి ఇవ్వటం వల్ల ఆదివారం వచ్చి చూసుకొని పోతున్నారు తప్ప ఇక్కడ ఉండడం లేదన్నారు. స్థానికులకే ఇళ్లను కేటాయించాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అపార్ట్ మెంట్లలో కనీస సదుపాయాలు లేవు పైకి ఎక్కడానికి మెట్లు కూడా విరిగిపోయి ఉన్నాయి, తాగే నీరు లేదు, రోడ్ లేవు, లైట్లు లేవు వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. ధరణి కొన్ని లక్షల మంది రైతుల భూముల అడ్రస్ లేకుండా చేసిందని, బొమ్మరాసి పేటలో 1059 ఎకరాల సమస్య కూడా వెంటనే పరిష్కారం అందించాలని డిమాండ్ చేశారు. ధరణి బాధలు భూభారత్ ద్వారా తీర్చాలని కోరారు. అధికారులు గ్రౌండ్ రియాలిటీతో పని చేయాలని, మెకానికల్ గా పనిచేయవద్దని హెచ్చరించారు.








