Mahaa Daily Exclusive

  ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు….

Share

ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు.
* భారత్ ప్రగతిలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ కీలక పాత్ర.
* స్వాతంత్య్ర సమరయోధుల నిర్బంధ శిబిరం నుంచి ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా.
* 75 ఏళ్ల ప్రస్థానానికి ప్రధాని మోదీ ప్రశంసలు

ఖరగ్‌పూర్, మహా:

భారతదేశ సాంకేతిక విద్యారంగంలో చారిత్రక మైలురాయిగా నిలిచిన తొలి భారతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఐఐటీ) ఖరగ్‌పూర్‌ 75 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా కొనియాడారు. ఎడ్లబండ్ల ప్రయాణం నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, ఉత్తరాల నుంచి సామాజిక మాధ్యమాల సందేశాల వరకు దేశం అనేక పరిణామాలను చూసిందని, ఈ మార్పులన్నింటిలోనూ ఐఐటీ ఖరగ్‌పూర్‌ కీలక పాత్ర పోషించిందని అన్నారు. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రాంగణంలో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ (75వ వార్షికోత్సవ) వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఉన్న ప్రాంతానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ఒకప్పుడు స్వాతంత్య్ర సమరయోధులను నిర్బంధించిన హిజ్లీ నిర్బంధ శిబిరం ఉన్న ప్రదేశంలోనే నేడు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యాసంస్థ రూపుదిద్దుకోవడం భారతదేశ పరిణామ క్రమానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆ నిర్బంధ శిబిరాల్లో స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల ఆలోచనలు, త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటికీ ఈ నేలలో ప్రతిధ్వనిస్తున్నాయని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం కలలుగన్న అదే గడ్డపై నేడు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువ మేధావులు తయారవుతున్నారని చెప్పారు.

స్వాతంత్య్రం కోసం పోరాడిన తరానికి దేశాన్ని స్వయం పాలనలోకి తీసుకురావాలనే ఆకాంక్ష ఉండేదని, నేటి తరం భారత్‌ను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తోందని మోదీ అన్నారు. స్వాతంత్య్ర ఆకాంక్ష నుంచి ఆత్మనిర్భరత వైపు సాగుతున్న ఈ ప్రయాణమే వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి అసలైన చోదకశక్తి అని పేర్కొన్నారు.

1951లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రారంభమైనప్పుడు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి కొద్దికాలమే అయిందని, దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు కూడా జరగలేదని గుర్తుచేశారు. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక నిపుణులను తయారుచేయాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైందన్నారు. అంతరిక్ష పరిశోధనలు, అణుశక్తి కార్యక్రమాలు, సమాచార సాంకేతిక రంగం, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు విశేషమైన సేవలందించారని తెలిపారు. వివిధ అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహించే స్థాయికి ఈ సంస్థ పూర్వ విద్యార్థులు ఎదగడం గర్వకారణమన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌ 75 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ ప్రత్యేక స్మారక నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. ’75 వాయిసెస్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా 75 మంది విద్యార్థులతో ముచ్చటించారు. వైద్య సాంకేతిక పరిజ్ఞానం, సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్య సేవలకు సంబంధించిన ఆవిష్కరణలను కూడా పరిశీలించారు.

1951లో ప్రారంభమైన ఐఐటీ ఖరగ్‌పూర్‌ దేశంలోనే తొలి ఐఐటీగా గుర్తింపు పొందింది. 1956 సెప్టెంబర్‌ 15న పార్లమెంట్‌ ఆమోదించిన చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థగా హోదా పొందింది. తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ 1956లోనే ఈ సంస్థ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని, హిజ్లీ నిర్బంధ శిబిరం స్థానంలో భారత భవిష్యత్తుకు ప్రతీకగా నిలిచే విద్యా సౌధం ఏర్పడిందని అభివర్ణించారు.