Mahaa Daily Exclusive

  బర్డ్ ఫ్లూపై భారత్‌ ‘బ్రహ్మాస్త్రం’

Share

బర్డ్ ఫ్లూపై భారత్‌ ‘బ్రహ్మాస్త్రం’
* దేశంలోనే తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఆవిష్కరణ.
* ఒక్క డోసు ధర రూ.1 నుంచి రూ.2 మాత్రమే.
* జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.

భోపాల్‌,మహా.

పౌల్ట్రీ రంగాన్ని ఏళ్లతరబడి కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్‌ కీలక ముందడుగు వేసింది. ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యంలో భాగంగా దేశీయ శాస్త్రవేత్తలు తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ 5ఎన్ 1 టీకాను అభివృద్ధి చేశారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ వ్యాక్సిన్‌ను జాతికి అంకితం చేశారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలోని భోపాల్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిహ్సాద్‌) శాస్త్రవేత్తలు నెలల తరబడి శ్రమించి ఈ అద్భుత ఆవిష్కరణను సాకారం చేశారు.
రైతులకు అందుబాటు ధరలో టీకా..
పౌల్ట్రీ రైతులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ టీకా ధరను అత్యంత తక్కువగా నిర్ణయించారు. ఒక్కో డోసును కేవలం రూ.1 నుంచి రూ.2 మధ్య అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఖరీదైన విదేశీ టీకాలను కొనుగోలు చేయలేని చిన్న, సన్నకారు పౌల్ట్రీ రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. బర్డ్ ఫ్లూ సోకినప్పుడు కోళ్లు మృత్యువాత పడటమే కాకుండా, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు లక్షలాది కోళ్లను పూడ్చిపెట్టాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరకే స్వదేశీ టీకా అందుబాటులోకి రావడం పౌల్ట్రీ పరిశ్రమకు కొత్త ఊపిరి పోయనుంది.
ఆరు నెలల పాటు పూర్తి రక్షణ..
కోళ్లలో అత్యంత ప్రమాదకరమైన హై పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లోని ‘క్లేడ్ 2.3.2.1ఎ వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ టీకాను రూపొందించారు. ఇనాక్టివేటెడ్ విధానంలో తయారుచేసిన ఈ వ్యాక్సిన్ కోళ్లలో రోగనిరోధక శక్తిని సమర్థంగా పెంచుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ టీకా వేసిన కోళ్లకు ఆరు నెలల పాటు వైరస్ నుంచి పూర్తి రక్షణ లభించినట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా, టీకా వేసిన కోళ్లతో పాటు ఉన్న ఇతర కోళ్లకు కూడా వైరస్ వ్యాపించకుండా ఇది సమర్థంగా అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
గత అనుభవాలకు చెక్‌.. రూ.300 కోట్లతో కొత్త ల్యాబ్‌
దేశంలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్‌లో తొలిసారి బర్డ్ ఫ్లూ వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకు 500కు పైగా వ్యాప్తి ఘటనలు నమోదయ్యాయి. 2006లో 10 లక్షలు, 2021లో 9 లక్షలు, ఈ ఏడాది మరో 2 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఈ వ్యాధి జంతువులతో పాటు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నందున నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జంతు వ్యాధులపై విస్తృత పరిశోధనల కోసం భోపాల్‌లో రూ.300 కోట్ల వ్యయంతో అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేయనున్నట్లు చౌహాన్‌ ప్రకటించారు. కొత్త వైరస్‌ల గుర్తింపు, వ్యాక్సిన్ల అభివృద్ధికి ఈ కేంద్రం వేదిక కానుంది.
భారత శాస్త్రీయ సత్తాకు నిదర్శనం..
విదేశాల్లో ఉంటూ భారత్‌ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడే వారికి మన శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయమే గట్టి సమాధానమని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. గతంలో కొవిడ్ సమయంలో స్వదేశీ టీకాలతో ప్రపంచానికి అండగా నిలిచిన భారత్‌, ఇప్పుడు జంతు ఆరోగ్య రంగంలోనూ తన సత్తా చాటుతోందని కొనియాడారు. పశుసంపద, పౌల్ట్రీ రంగాల బలోపేతంతో పాటు రైతుల ఆదాయం పెంపునకు ఈ స్వదేశీ టీకా ఒక మైలురాయిగా నిలవనుంది.