Mahaa Daily Exclusive

  ఢిల్లీని కమ్మేసిన విష వాయువులు….

Share

ఢిల్లీని కమ్మేసిన విష వాయువులు.
* 191 పరిశ్రమలకు తాళాలు!
* ఏక్యూఐ 370కి చేరడంతో కేంద్రం కొరడా.
* ఉల్లంఘనలకు పాల్పడితే కరెంటు కట్.

న్యూఢిల్లీ, మహా .

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొగమంచుకు తోడు కాలుష్య మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కఠిన నిర్ణయాలు తీసుకుంది. కాలుష్య నియంత్రణ నిబంధనలను తుంగలో తొక్కుతున్న పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతూ, కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయని 191 పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు అవసరమైతే సీజ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లను సమన్వయం చేస్తూ కాలుష్య నియంత్రణకు కేంద్రం సమగ్ర కార్యాచరణను ప్రకటించింది.

ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత సూచీ.

రాజధానిలో 24 గంటల సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 370 మార్కును తాకి అత్యంత అధ్వాన్నమైన ‘వెరీ పూర్’ కేటగిరీలోకి చేరింది. నగరంలోని మొత్తం 59 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో నమోదైన గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. వీటిలో 17 కేంద్రాల్లో ఏక్యూఐ అత్యంత ప్రమాదకరమైన ‘సివియర్’ స్థాయికి చేరుకోగా, 38 కేంద్రాల్లో ‘వెరీ పూర్’, మూడు కేంద్రాల్లో ‘పూర్’ స్థాయిలో నమోదైంది. కేవలం ఒక్క కేంద్రంలో మాత్రమే ‘మోడరేట్’ స్థాయి గాలి నాణ్యత కనిపించింది. ముఖ్యంగా పీఎం10 కాలుష్య కారకాల తీవ్రత అధికంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. వాహనాల నుంచి వెలువడే పొగ, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, బాణసంచా, పరిశ్రమల ఉద్గారాలు ఢిల్లీ గాలిని విషతుల్యం చేస్తున్నాయి.

2,345 పరిశ్రమలపై నిరంతర నిఘా.

పారిశ్రామిక కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మొత్తం 2,345 పరిశ్రమలను ప్రత్యేక పర్యవేక్షణ పరిధిలోకి తీసుకొచ్చింది. వీటిలో ఇప్పటివరకు 2,298 పరిశ్రమలను ఆన్‌లైన్ నిరంతర ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థ (ఓసీఈఎంఎస్)కు అనుసంధానించారు. నిబంధనలు పాటించని 47 పరిశ్రమలను ఇప్పటికే మూసివేయడం లేదా సీజ్ చేయడం జరిగింది. తాజాగా కాలుష్య నియంత్రణ పరికరాలు (ఏపీసీడీలు) అమర్చుకోని మరో 191 పరిశ్రమలకు మూసివేత నోటీసులు జారీ చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే పర్టిక్యులేట్ మ్యాటర్ ఉద్గారాలు ప్రతి ఘన మీటరుకు 50 మిల్లీగ్రాములకు మించకూడదని కఠిన నిబంధన విధించారు.

అధికారులపై జవాబుదారీతనం.. వారానికోసారి సమీక్ష.

కాలుష్య నియంత్రణ చర్యల అమలులో అధికార యంత్రాంగం ఉదాసీనతను సహించేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కార్యదర్శి స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఈ అధికారులు హరియాణాలోని ఏడు, ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు, రాజస్థాన్‌లోని నాలుగు కలిపి మొత్తం 15 నగరాల్లో కాలుష్య నియంత్రణ చర్యలను పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి ప్రతి వారం గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం)కు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. విధుల్లో అలసత్వం వహించే అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని ఆదేశించారు.

సరిహద్దు మార్గాల్లో కొత్త వ్యవస్థ.. పాత వాహనాలకు స్వస్తి.

వాహన కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రవాణా శాఖకు కీలక ఆదేశాలు అందాయి. వాహనాల నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే ఏఎన్‌పీఆర్ కెమెరాలను నవంబర్ 30లోగా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఢిల్లీలోని 154 సరిహద్దు ప్రవేశ మార్గాల్లో మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) వ్యవస్థలను డిసెంబర్ 31, 2026లోగా అందుబాటులోకి తేవాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు సూచించారు. దీనివల్ల సరిహద్దుల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయి పొగ వదలడం తగ్గుతుందని భావిస్తున్నారు. ఎన్‌సీఆర్ పరిధిలో గుర్తించిన 233 ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లోనూ తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు ‘పరివర్తన్’ పథకాన్ని వేగవంతం చేసి బీఎస్-6 ప్రమాణాలు లేని పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో 2028 నాటికి బీఎస్-6, సీఎన్‌జీ, విద్యుత్ వాహనాలను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రహదారుల దుమ్ము, నిర్మాణ ప్రాంతాలపై కొరడా.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో రహదారులపై పేరుకుపోయే దుమ్మును అరికట్టేందుకు 5,480 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి, నిర్వహణ పనులను చేపట్టగా, ఇప్పటివరకు 3,221 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, రోడ్లపై గుంతలు పూడ్చడం, ఫుట్‌పాత్‌ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యాంత్రిక రోడ్డు శుభ్రపరిచే యంత్రాలను రోజుకు రెండు షిఫ్టుల్లో నడుపుతూ, వాటి పనితీరును డిజిటల్ ట్రాకింగ్, కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా పర్యవేక్షించనున్నారు. అలాగే ఎన్‌సీఆర్ పరిధిలోని 3,000కు పైగా నిర్మాణ ప్రదేశాలపై అధికారులు ప్రత్యక్ష నిఘా పెట్టారు. దుమ్ము వ్యాప్తిని అరికట్టేందుకు నీటిని చల్లడం, కవర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలతో పాటు పనులను నిలిపివేయనున్నారు.

చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి.. గ్రాప్ నిబంధనలు కఠినతరం.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాలుగా మారింది. రోజువారీగా ఉత్పత్తి అవుతున్న చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యంలో 6,747 టన్నుల లోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, తగులబెట్టడాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీలోని ఓఖ్లా, ఘాజీపూర్, భల్స్వా, హరియాణాలోని బంధ్వారీ డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన పాత వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. గాలి నాణ్యత మరింత క్షీణించినప్పుడు అమలు చేసే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) నిబంధనలను అన్ని విభాగాలు తూ.చ. తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశించింది. అవసరమైన చోట ఇంటి నుంచే పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానాన్ని ప్రోత్సహించాలని సూచించింది. ఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సీఏక్యూఎం రూపొందించిన ‘పవన్’ డిజిటల్ వేదిక ద్వారా కాలుష్య నియంత్రణ చర్యలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. కేవలం శీతాకాలంలోనే కాకుండా ఏడాది పొడవునా నాలుగు రాష్ట్రాల సమన్వయంతో పనిచేస్తేనే ఢిల్లీ ప్రజలకు కాలుష్య కోరల నుంచి విముక్తి లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.