Mahaa Daily Exclusive

  లోక్‌సభ స్థానాల పెంపునకు ముహూర్తం….

Share

లోక్‌సభ స్థానాల పెంపునకు ముహూర్తం.
* శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు?
* 543 నుంచి 850కి పెంచేలా కేంద్రం కసరత్తు.
* 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలే లక్ష్యం.
* దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు చెక్.
* 1971 జనాభా ప్రాతిపదికన 50 శాతం పెంపు ఫార్ములా!

న్యూఢిల్లీ, మహా.

దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం మరోసారి అడుగులు వేస్తోంది. డిసెంబర్ తొలి వారంలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ స్థానాలను పెంచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని అధికార ఎన్డీయే కూటమి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2029 సాధారణ ఎన్నికల నాటికి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ కసరత్తును వేగవంతం చేసింది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను ఇప్పటివరకు ప్రోరోగ్ చేయకపోవడంతో, అవసరమైతే తక్కువ వ్యవధి నోటీసుతోనే ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంది.

దక్షిణాది రాష్ట్రాలకు భరోసా ఇచ్చేలా కొత్త ఫార్ములా.

ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను గరిష్ఠంగా 850కి పెంచేలా రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అభ్యంతరాలకు తెరదించేందుకు కేంద్రం ఒక ప్రత్యేక ఫార్ములాపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 1971 జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత వాటాను ఏమాత్రం తగ్గించకుండా, అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం చొప్పున పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ లెక్కన మొత్తం సీట్ల సంఖ్య 543 నుంచి దాదాపు 815 లేదా 816కు చేరుకునే అవకాశం ఉంది. ఈ విధానం అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి పెరుగుతాయని అంచనా. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అసలైన పరీక్ష.. 361 మంది సభ్యుల మద్దతు.

గత ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలం లేక ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో రాబోయే శీతాకాల సమావేశాల్లో బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలని ఎన్డీయే భావిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుతం సభలో మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో 540 మంది సభ్యులు ఉన్నప్పటికీ, బిల్లు గట్టెక్కాలంటే కనీసం 361 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 320 మంది ఎంపీల బలం మాత్రమే ఉండటంతో, మిగిలిన 41 మంది సభ్యుల మద్దతు కోసం తటస్థ పార్టీలు, విపక్షాల్లోని కొన్ని వర్గాలతో కేంద్ర పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్‌ఐఆర్‌ వివాదంతో విపక్షాల ఎదురుదాడి.

మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి పదునైన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భారీ ఎత్తున అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 13 కోట్లకు పైగా ఓట్లను జాబితా నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతుండగా, దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను విపక్షాలు బలంగా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. సభ సజావుగా జరిగితేనే రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ సాధ్యమవుతాయని అధికార పక్షం భావిస్తుండగా, ఎస్‌ఐఆర్‌ అంశంపై విపక్షాల ఆందోళనలతో శీతాకాల సమావేశాలు తీవ్ర వాదోపవాదాలకు వేదికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.