2031 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం.
* 2029 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలూ భారత్‌కే.
* 2035 వరకు ఐసీసీ టోర్నీల షెడ్యూల్ ఖరారు.
ఢిల్లీ, మహా.
భారత క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీపి కబురు అందించింది. 2031 వన్డే ప్రపంచకప్ నిర్వహణ హక్కులను భారత్ దక్కించుకుంది. బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమివ్వనుంది. మరోవైపు 2029 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను కూడా భారత్‌కే అప్పగించింది. ఇండోనేసియాలోని బాలిలో ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో 2035 వరకు పురుషుల క్రికెట్లో నిర్వహించనున్న ప్రధాన టోర్నీల షెడ్యూల్‌ను ఖరారు చేసి ఆమోదించారు. 2027, 2029, 2031 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుంది.
భారత్‌లో ఐదోసారి వన్డే ప్రపంచకప్
వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వడం 2031లో ఐదోసారి కానుంది. తొలిసారిగా 1987లో భారత్ ఈ మెగా టోర్నీని నిర్వహించింది. 1996లో పాకిస్థాన్, శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ఆతిథ్యమిచ్చింది. 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకతో కలిసి మరోసారి ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించింది. 2023లో పూర్తిస్థాయి ఆతిథ్య దేశంగా వ్యవహరించింది. ఆ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరినా.. అహ్మదాబాద్‌లో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. ఇప్పుడు 2031లో మరోసారి ప్రపంచకప్ నిర్వహణ అవకాశం భారత్‌కు దక్కింది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు ఈ టోర్నీ జరగనుంది.
23 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ
2006 తర్వాత తొలిసారిగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనుంది. 2029 అక్టోబర్ 9 నుంచి 28 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. దాదాపు 23 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ భారత్‌లో జరగనుండటం విశేషం.
2035 వరకు ఐసీసీ పురుషుల టోర్నీల షెడ్యూల్
2028లో టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్త ఆతిథ్యంలో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 12 వరకు జరగనుంది. 2029 జూన్ 8 నుంచి 12 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. అదే ఏడాది అక్టోబర్ 9 నుంచి 28 వరకు భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు.
2030 జులై 4 నుంచి ఆగస్టు 4 వరకు టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ కలిసి నిర్వహించనున్నాయి. 2031 జూన్ 12 నుంచి 16 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లో జరగనుంది. అదే ఏడాది అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.
2032 అక్టోబర్ 14 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. అయితే ఆ టోర్నీ ఆతిథ్య దేశాలను ఇంకా ఖరారు చేయలేదు. 2033 జూన్ 9 నుంచి 13 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్, అక్టోబర్ 2 నుంచి 23 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు. ఈ రెండు టోర్నీల వేదికలు నిర్ణయించాల్సి ఉంది.
2034 జులై 6 నుంచి ఆగస్టు 6 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుండగా, ఆతిథ్య దేశాలను ప్రకటించాల్సి ఉంది. 2035 జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్, అక్టోబర్ 2 నుంచి నవంబర్ 18 వరకు వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్నారు. వీటి వేదికలు కూడా ఇంకా ఖరారు కాలేదు. మొత్తంగా 2035 వరకు అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌కు ఐసీసీ రూపకల్పన చేసింది.






