Mahaa Daily Exclusive

  హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ… పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే…

Share

 

హైదరాబాద్, మహా : మినీ మేడారం సమయంలో జరిగిన ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణహైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను తాను దూషించాననే ఫిర్యాదుపై కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు కావడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాయిస్ శాంపిల్ సమర్పించాలని ఆదేశిస్తూ పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను కమిషనర్‌ను ఏమీ అనలేదని, ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఇరువైపులా వాదనలను సమగ్రంగా విన్న అనంతరం కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో ఈ కేసు విచారణలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు తన వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సి ఉంటుంది.

అసలేం జరిగిందంటే..

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులు జనవరి నెలాఖరులో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన మినీ మేడారం సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా, పోలీస్ కమిషనర్‌ను మతం పేరుతో దూషించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై భారతీయ న్యాయ సంహిత 126(2), 132, 196, 299 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హైకోర్టు నిబంధనల ప్రకారం జాతరకు పరిమిత వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు సూచించగా, భారీ కాన్వాయ్‌తో వచ్చిన కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో కలిసి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుందని, అప్పటి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ బెదిరించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం నాలుగు వాహనాలకు అనుమతివ్వడంతో ఆయన గద్దెల వద్దకు చేరుకున్నారు.

అక్కడ దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలని కౌశిక్ రెడ్డి పట్టుబట్టగా, స్థానిక ట్రస్టీ వర్గంతో విభేదాల కారణంగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు ఆయనను, కుటుంబసభ్యులను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు, జాతరలో మొక్కులు చెల్లించుకోకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.