హైదరాబాద్, మహా : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ మార్గాల్లో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఫిర్యాదుల మేరకు ఆమెపై ఇది వరకే ఏసీబీ కేసు నమోదు చేసింది. నగరంలోని అత్తాపూర్‌లో ఉన్న వాణి నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మరికొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.
కాగా, గత సెప్టెంబర్ 30న ఓ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేలు లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో గుండు వాణి ఏసీబీ చేతికి చిక్కారు. అదే ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యలమోని సుదర్శన్ సైతం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. టౌన్ ప్లానింగ్ అధికారిణి అయిన గుండువాణి తరఫున సుదర్శన్ లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తులో భాగంగా వాణి ఆస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆమె నివాసంతో పాటు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి సోదాలు జరిపారు.
హైదరాబాద్, మహబూబ్ నగర్లలో పలుచోట్ల స్థలాలు గుర్తింపు
సెప్టెంబర్ 30న మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసులో అధికారిణి గుండు వాణి, అసిస్టెంట్ సుదర్శన్ లంచం తీసు లంచం తీసుకుంటూ దొరికారని ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంపై ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టగా హైదరాబాద్ లో 4 చోట్ల స్థలాలు, మహబూబ్ నగర్ లో 4 చోట్ల స్థలాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ అంశంపై వారం రోజుల కిందట ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గుండువాణి నివాసం, ఇతర ఆస్తులతో పాటు ఆమె బంధువులు, స్నేహితుల ఇళ్లళ్లో కలిపి మొత్తం 28 చోట్ల దాడులు నిర్వహించామని ఏసీబీ వెల్లడించింది. సోదాలు పూర్తయ్యాక మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు.







