Mahaa Daily Exclusive

  అక్వాన్ తుపాను ముప్పు….

Share

  • అక్వాన్ తుపాను ముప్పు
  • తెలంగాణలో భారీ వర్షాలు
  • పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్, మహా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ‘అక్వాన్’ తుపానుగా మారుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. నవంబర్ 21వ తేదీన తుపాను ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరవచ్చని.. కొన్ని ప్రాంతాల్లో 150 నుంచి 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

ఈ తుపానుకు ఇరాన్ సూచించిన ‘అక్వాన్’ అనే పేరు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ వ్యవస్థ విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా సుమారు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ నాటికి తుపానుగా.. నవంబర్ 17వ తేదీ నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత మరింత బలపడి నవంబర్ 19వ తేదీ నాటికి అతి తీవ్ర తుపానుగా మారవచ్చని పేర్కొంది. తుపాను సమయంలో గంటకు 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. గరిష్ఠ వేగం గంటకు 145 కిలోమీటర్ల వరకు చేరవచ్చని తెలిపింది.

ప్రస్తుత వాతావరణ నమూనాల ప్రకారం.. అక్వాన్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 20వ తేదీన నెల్లూరు నుంచి తుని మధ్య, ముఖ్యంగా కావలి నుంచి కోనసీమ ప్రాంతాల మధ్య ఒంగోలు లేదా బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తుపాను తీరం దాటే ప్రాంతం, తీవ్రతపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో నవంబర్ 18వ తేదీ నుంచే వర్షాలు ప్రారంభమై.. 19, 20వ తేదీల్లో తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

అక్వాన్ తుపాను ఈనెల 20 నుంచి 22 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 150 నుంచి 200 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా నవంబర్ 21వ తేదీన వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విశ్లేషకులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ 2 రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అయితే పశ్చిమ తెలంగాణ జిల్లాలపై తుపాను ప్రభావం తక్కువగా ఉండవచ్చని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ తేలికపాటి వర్షాలు లేదా పొడి వాతావరణం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.