Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో కొత్తగా మూడు ఆర్టీవో కార్యాలయాలు…..

Share

  • హైదరాబాద్‌లో కొత్తగా మూడు ఆర్టీవో కార్యాలయాలు
  • లైసెన్సులు, రిజిస్ట్రేషన్లలో జాప్యానికి చెక్‌
  • రవాణాశాఖ కీలక ప్రతిపాదనలు

హైదరాబాద్, మహా :హైదరాబాద్‌ నగర పరిధిలో రవాణాశాఖ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని రవాణాశాఖ కార్యాలయాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి కేంద్రీకృత విధానంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా కొనసాగుతున్న కార్యాలయాల మధ్య సమన్వయం లేకపోవడం, ఒక కార్యాలయంలోని సమాచారం మరో కార్యాలయానికి అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం. పని విభజనను క్రమబద్ధీకరించి ప్రజలకు వేగంగా సేవలు అందించడంతో పాటు రవాణాశాఖ కార్యకలాపాలపై సమర్థ పర్యవేక్షణ ఉండేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా క్యూర్‌ పరిధిలో మరో మూడు ప్రాంతీయ రవాణా కార్యాలయాలు కొత్తగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా మొత్తానికి జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌ జోన్‌ కార్యాలయంలో ఇద్దరు ఆర్టీవోలు ఉండగా.. సికింద్రాబాద్‌ ఉత్తర జోన్‌, మలక్‌పేట తూర్పు జోన్‌, బండ్లగూడ దక్షిణ జోన్‌, టోలిచౌకి పశ్చిమ జోన్‌ కార్యాలయాలను వేర్వేరు ఆర్టీవోలు నిర్వహిస్తున్నారు. నాగోల్‌లో వాహనాల డ్రైవింగ్‌ పరీక్షల కోసం టెస్ట్‌ ట్రాక్‌ కూడా ఉంది. ఈ కార్యాలయాలన్నీ క్యూర్‌ పరిధిలో ఉన్నప్పటికీ పరస్పర సమాచార మార్పిడిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక కార్యాలయంలో వాహనదారుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసినా, సంబంధిత సమాచారం మరో కార్యాలయానికి అందకపోవడంతో సదరు వ్యక్తి వేరే కార్యాలయాన్ని సంప్రదించి లైసెన్స్‌ పొందే అవకాశాలు ఉంటున్నాయి. కార్యాలయాలు సమీపంలోనే ఉన్నప్పటికీ సేవల నిర్వహణలో సమన్వయ లోపం, జాప్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి పరిష్కారంగా అన్ని కార్యాలయాలను ఒకే పరిపాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

క్యూర్‌ పరిధిలో రవాణాశాఖ నిర్వహణకు సంబంధించి కొత్తగా రూపొందిస్తున్న ప్రతిపాదనలో 12 ఆర్టీవోలు, 60 మంది మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు (MVI), అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లతో వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న 12 జోన్లు, 60 సర్కిళ్ల తరహాలో రవాణాశాఖ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరించనున్నారు. ప్రస్తుతం యూనిట్‌ కార్యాలయాలుగా ఉన్న వాటిని ప్రాంతీయ రవాణా కార్యాలయాలుగా మార్చాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్‌లో కొత్త ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు.

కొత్త ప్రతిపాదన ప్రకారం క్యూర్‌ పరిధి మొత్తానికి ఒకే జేటీసీ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్యాలయాల వ్యవస్థలో పెద్దగా మార్పులు ఉండకపోగా.. మిగిలిన రెండు జిల్లాల్లో ఒక్కో ఆర్టీవో కార్యాలయం అదనంగా ఏర్పాటు కానుంది. మొత్తంగా హైదరాబాద్‌ జిల్లాలో ఆరు, మిగిలిన రెండు జిల్లాల్లో మూడేసి చొప్పున 12 ఆర్టీవో కార్యాలయాలు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే కార్యాలయాల మధ్య సమన్వయం పెరగడంతో పాటు వాహనదారులకు లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, ఇతర రవాణా సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుంది. అయితే కొత్త కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, పరిధుల విభజనపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.