Mahaa Daily Exclusive

  ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు….

Share

  • ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు
  • రూ. 3,500 కోట్ల పెట్టుబడులు
  • 18 వేల మందికి ఉద్యోగాలు
  • రాష్ట్ర ప్రభుత్వంలో ఎంవోయూ చేసుకున్న ఆయా వర్సిటీలు

అమరావతి, మహా : ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రంగంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రానికి మరో నాలుగు కొత్త యూనివర్సిటీలు రానున్నాయి. వీటిలో రెండు ప్రైవేటు వర్సిటీలు కాగా, మరో రెండు డీమ్డ్ వర్సిటీలు తమ ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు ఆయా సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నాలుగు యూనివర్సిటీలు మొత్తం రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 6,000 మందికి, పరోక్షంగా 12,000 మందికి మొత్తంగా 18 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటికి 160 నుంచి 200 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా. ఇప్పటికే అమరావతి, విశాఖలో రెండు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపగా, మిగిలిన రెండింటికి స్థలాలను ఖరారు చేయాల్సి ఉంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2025 నేషనల్ ర్యాంకింగ్స్‌లో టాప్-70లో నిలిచిన ఈ సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి.

1. గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ – అమరావతి

గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్… దీని పరిధిలో మొత్తం 36 విద్యాసంస్థలున్నాయి. ఇది అమరావతిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. రూ. 2,000 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,600 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. రెండు విడతల్లో (మొదట 30, రెండో విడతలో 20 ఎకరాలు) మొత్తం 50 ఎకరాలు భూకేటయింపు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఆ భూమి పక్కపక్కనే లేదా సమీపంలో ఉండాలని జీయూఎస్ కోరింది. ఎన్‌ఐఆర్‌ఎఫ్-2025 ర్యాంకింగ్‌లో యూపీఈఎస్ 45వ స్థానంలో ఉంది.

2. షూలిని యూనివర్సిటీ

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌కు చెందిన షూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ ఏపీలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేయనుంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దీనికి 30-50 ఎకరాల భూమి అవసరం కాగా, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్-2025 ర్యాంకింగ్‌లో ఈ వర్సిటీ 69వ స్థానంలో నిలిచింది.

3. థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్- విశాఖపట్నం

పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (డీమ్డ్ వర్సిటీ) విశాఖలో ఆఫ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,400 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. విశాఖలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్-2025 ర్యాంకింగ్‌లో టీఐఈటీ 26వ స్థానంలో ఉండటం విశేషం.

4. నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్

డీమ్డ్ వర్సిటీ అయిన నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ రాష్ట్రంలో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,500 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. దీనికి 30-50 ఎకరాల భూమి అవసరం కాగా, ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఎన్‌ఐఆర్‌ఎఫ్-2025 ర్యాంకింగ్‌లో ఇది 52వ స్థానంలో ఉంది.