Mahaa Daily Exclusive

  ఏఐ మోసాలపై కఠిన చర్యలు తీసుకోండి…

Share

  • ఏఐ మోసాలపై కఠిన చర్యలు తీసుకోండి
  • డీప్‌ఫేక్‌లు, డిజిటల్‌ మోసాలను అరికట్టాలి..
  • కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం

హైదరాబాద్‌, మహా : కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత దుర్వినియోగం, డీప్‌ఫేక్‌ వీడియోలు, డిజిటల్‌ మోసాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రముఖ సినీనటుడు చిరంజీవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు చిరంజీవి తెలిపారు. ఆయన సూచన మేరకు కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందించినట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల ముఖాలు, గొంతులను అనుకరించి నకిలీ వీడియోలు రూపొందిస్తున్నారని, వీటిని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు.

కళాకారుల గౌరవం, వ్యక్తిగత గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడటంతో పాటు ప్రతి పౌరుడి డిజిటల్‌ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్‌ 2న చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీప్‌ఫేక్‌ సాంకేతికత దుర్వినియోగం, దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై చర్చించారు. తమ ఆందోళనలను అమిత్‌ షా అర్థం చేసుకున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం పరిశీలించి అవసరమైన చర్యలు, కఠిన శిక్షలు ప్రవేశపెట్టే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు అప్పట్లో చిరంజీవి సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.