Mahaa Daily Exclusive

  భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు….

Share

  • భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు
  • రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
  • రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన విదేశీయులపై చర్యలు తీసుకోండి
  • ఎఫ్ఆర్ఆర్ఓలో ఫిర్యాదు చేసిన రాంచందర్ రావు

హైదరాబాద్‌, మహా : కొందరు విదేశీయులను భారత్‌కు రప్పించి, దేశ ప్రధాని, ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయంగా దేశ పరువు తీయాలని చూసిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ఓ)లో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీని మళ్లీ రాజకీయంగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ, వారి కూటమి విదేశీయుల సహాయం కోరుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ సమ్మిట్ 2026 వేదికగా ఇటలీకి చెందిన వారితో భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ పార్టీ విభాగాల సహ సమన్వయకర్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఢిల్లీలో విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 97 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌కు విదేశీ ప్రతినిధులు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా విదేశీ నేతలతో విమర్శలు చేపించిన కల్పించిన రాహుల్ గాంధీ, ఆ పార్టీ తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్ సమ్మిట్‌కు హాజరైన విదేశీ ప్రతినిధుల పూర్తి వివరాలను బయటపెట్టాలని, వీసా నిబంధనల ఉల్లంఘన జరిగితే కేంద్ర అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాహుల్ గాంధీని రీఎస్టాబ్లిష్ చేసేందుకే

వరుస ఎన్నికల పరాజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీని రాజకీయంగా నిలబెట్టేందుకు, రీఎస్టాబ్లిష్ చేయడానికి విదేశీయుల సహాయం కోరుతోందని రాంచందర్ రావు ఆరోపించారు. భారత గడ్డను విదేశీయుల రాజకీయ జోక్యానికి వేదికగా మార్చే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని.. ప్రజాస్వామ్యంలో ప్రధాని మోదీని విమర్శిస్తే సహిస్తాం కానీ విదేశీయులతో భారత్ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదన్నారు. ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌లో రెచ్చగొట్టే రాజకీయ వ్యాఖ్యలు చేసిన విదేశీయుడు జియాకోమో ఫిలిబెక్‌పై విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ఓ)లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నిరంతరం దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం ఆ పార్టీ నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు.

ఒక విదేశీయుడు భారత ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రధానిని అవమానిస్తుంటే, దేశ అంతర్గత విషయాలపై మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడం సిగ్గుచేటు అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రామచందర్ రావు కోరారు. భారత్ సదస్సు నిర్వాహకుల పాత్రపైనా లోతైన విచారణ జరపాలని రాష్ట్ర బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. దశబ్దాల కిందటే ఓట్ చోరీ చేసిన పార్టీ కాంగ్రెస్ అని, ప్రధాని పదవి కోసం పార్టీని సైతం చీల్చిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానికి ఉందని ఇటీవల విమర్శించారు.