Mahaa Daily Exclusive

  రాహుల్‌, రేవంత్‌ లపై ఈటల ఫైర్‌…

Share

  • రాహుల్‌, రేవంత్‌ లపై ఈటల ఫైర్‌
  • ముఖ్యమంత్రిగా బాధ్యతను విస్మరిస్తున్న రేవంత్‌రెడ్డి
  • రాష్ట్రంలో తాగునీరు, సాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోలేదు
  • హైదరాబాద్‌ సమ్మిట్‌ పేరుతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం
  • కాంగ్రెస్‌ చరిత్రే కుంభకోణాలమయం

యాదాద్రి భువనగిరి జిల్లా, మహా : రాష్ట్రంలో ఏ సమస్య ఎదురైనా దాని బాధ్యతను ఇతరులపై నెట్టి, ఎదురుదాడి ద్వారా అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ముఖ్యమంత్రిగా తనకున్న బాధ్యతను గుర్తించడం లేదని మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌ విమర్శించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే కాలంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ఏడాది ముందుగానే హెచ్చరించాయని ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ పరిస్థితులపై తాను తొలి ప్రెస్‌మీట్‌ నిర్వహించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశానని చెప్పారు. “రేవంత్‌రెడ్డి గారూ.. మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, మీ కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదు. భూమి మీద ఉండి ఆలోచించండి” అని అప్పుడే హితవు పలికినట్లు గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాల కొరత, విద్యుత్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ముందుగానే ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.

కేసీఆర్‌పై కోపం ఉంటే ఉండవచ్చని, కానీ ఆ కోపంతో తెలంగాణ రైతాంగాన్ని శిక్షించవద్దని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. బోర్లు, బావులు ఎండిపోవడంతో హాస్టళ్లలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవు

పంటలు ఎండిపోయిన పరిస్థితుల్లో రైతులు చేతికొచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని ఈటల మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ గన్నీ సంచులు, హమాలీ వ్యవస్థ, కాంటాలు, టార్పాలిన్లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. రైతాంగ సమస్యలపై చర్చించేందుకు కనీసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ‘నాకు తెలియదా.. అన్నీ నేనే చేస్తా’ అనే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు.

హైదరాబాద్‌ సమ్మిట్‌ పేరుతో దేశ ప్రతిష్ఠకు భంగం

నిరుద్యోగులను మోసం చేస్తూ, ప్రైవేట్‌ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం.. ‘ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌’ పేరుతో హైదరాబాద్‌లో కాంక్లేవ్‌ నిర్వహించడాన్ని ఈటల తప్పుబట్టారు. ఈ సమావేశం పరిశ్రమల స్థాపన కోసం కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కానీ నిర్వహించడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ప్రపంచ దేశాల ముందు ప్రచారం చేస్తూ భారత్‌ ప్రతిష్ఠ, గౌరవాన్ని దెబ్బతీసేందుకే రాహుల్‌గాంధీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించారు.

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న తీరు చూసి భారత జాతి సిగ్గుతో తలదించుకుంటోందన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడే సత్తా లేక, వాస్తవాలను ధైర్యంగా చెప్పలేక బయట అబద్ధాలతో అశాంతిని సృష్టించాలనే ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంక, నేపాల్‌, అఫ్గానిస్తాన్‌ తరహాలో దేశంలో అల్లర్లు జరగాలని కాంగ్రెస్‌ నాయకులు కోరుకుంటున్నారని ఆరోపించారు. అయితే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలంతా ప్రధాని మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ చరిత్రే కుంభకోణాలమయం

సోనియాగాంధీ పుస్తకావిష్కరణ, కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలపై స్పందించిన ఈటల.. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో అనేక కుంభకోణాలు ఉన్నాయని విమర్శించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలోనే ఎల్‌ఐసీ కుంభకోణం, సైనిక జీపుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బోఫోర్స్‌ నుంచి 2జీ, బొగ్గు కుంభకోణం వరకు, సొంత మంత్రులే జైలుకు వెళ్లిన చరిత్ర కాంగ్రెస్‌దేనని అన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో ఎలాంటి మచ్చ లేకుండా దేశం గర్వపడేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అధికారం కోల్పోతామనే ఆందోళనతో, గుడ్డి ద్వేషంతో కాంగ్రెస్‌ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితమైందని, అవి కేరళ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ అని ఈటల పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణల్లో 30 నుంచి 40 శాతం ప్రభుత్వాలు మాత్రమే నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి

హైదరాబాద్‌కు వచ్చి ప్రధాని మోదీని, దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్‌ అంటూ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. “రేవంత్‌రెడ్డిగారూ.. మీ ప్రభుత్వం గాన్‌ కేస్‌ . 2028 ఎన్నికల్లో మీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఇచ్చిన హామీలేమిటో, వాటిని ఎలా అమలు చేస్తారో చెప్పాలి. అంతేకానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయవద్దు” అని అన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడి, ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వాస్తవ పరిస్థితులను గుర్తించి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌చార్జి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రచ్చ శ్రీను, మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌కుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌, మహేష్‌, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.