Mahaa Daily Exclusive

  ఎన్ హెచ్ఎంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందే…

Share

  • ఎన్ హెచ్ఎంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందే
  • ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదు?
  • ప్రతినెల 1నే జీతాలివ్వాలి
  • సమ్మె కాలానికి వేతనాన్ని పూర్తిగా చెల్లించాలి
  • లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తాం
  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక

కరీంనగర్, మహా : ఇచ్చిన హామీ ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమ్మె కాలంలో నిలిపివేసిన వేతనాన్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు పలువురు ఎన్ఎహెచ్ఎం ఉద్యోగ సంఘం జేఎసీ అధ్యక్షులు రమేశ్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందించారు.

ఎన్ హెచ్ఎంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, జీవో నెం 60ను అమలు చేయడంతోపాటుజీవో నెం.1195 ప్రకారం వేతనాలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలోకి తీసుకురావాలి. స్పర్ష్ విధానం ద్వారా జీతాలు చెల్లించాలని విజ్ఝప్తి చేశారు. అట్లాగే ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఎన్ హెచ్ఎం ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రయోజనాలను కల్పించాలని కోరారు. ముఖ్యంగా సమ్మె కాలానికి పూర్తి వేతనాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. గతంలో ఈ హామీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, 90 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందునే సమ్మెను విరమించామని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్ హెచ్ఎం ఉద్యోగుల సమస్యలపట్ల సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్ఎం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆయా ఉద్యోగుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులున్నారు.