• మదన్ మోహన్ పేరుతో సిద్దిపేట మెడికల్ కాలేజీ.
• నవంబర్ 26 నుంచి కోటి చీరల పంపిణీ.
• సీఎం రేవంత్‌రెడ్డి
సిద్దిపేట, మహా:
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26 నుంచి రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన సభలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ముస్తాబాద్ చౌరస్తా నుంచి సభా వేదిక వరకు ప్రజలతో కలిసి సుమారు 2 కిలోమీటర్ల మేర పాదయాత్రగా చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సిద్దిపేట శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మదన్ మోహన్ తొలి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ మెడికల్ కాలేజీగా పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.
మల్లన్నసాగర్ ముంపునకు గురైన 14 గ్రామాల్లోని నిజమైన లబ్ధిదారులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే అధికారులు గ్రామాల్లో పర్యటించి ఇళ్లలోకి వస్తారని, అర్హులను గుర్తించిన అనంతరం నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటిలో ఒక్క చుక్కను కూడా వదులుకోబోమని తేల్చిచెప్పారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ, ఖమ్మం జిల్లాలో సీతారామసాగర్ వంటి ప్రాజెక్టులను గత పదేళ్లలోనే పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం నీటి కష్టాలు ఎదురయ్యేవి కాదని వ్యాఖ్యానించారు.
1983 నుంచి 2023 వరకు వివిధ ప్రభుత్వాల హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ రద్దు చేయలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉన్న పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తూనే కొత్త పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డుల జారీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 50 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్, 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను వివరించారు.
రుణమాఫీతో పాటు రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వరి ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్‌రెడ్డి, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








