Mahaa Daily Exclusive

  డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం….

Share

డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.
* ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు వెంకటేష్ మద్దతు.
* ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ వాక్.
* వెంకటేష్‌ను కలిసి ఆహ్వానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

హైదరాబాద్, మహా.

యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (హైదరాబాద్ వాక్)కు ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు కలిసి యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించారు.
డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి బాధ్యత: వెంకటేష్
యాత్రకు మద్దతు ప్రకటించిన సందర్భంగా సినీ నటుడు వెంకటేష్ మాట్లాడుతూ, సమాజాన్ని మరియు ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి సామాజిక బాధ్యతని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలు, సృజనాత్మక రంగాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలపెట్టిన ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భావితరాల భద్రత కోసమే ఈ మహా యజ్ఞం: కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్” పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మత్తుపదార్థాల కట్టడికి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భావితరాల భద్రత కోసం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, నగర ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.