Mahaa Daily Exclusive

  గాంధీ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ కలకలం!

Share

గాంధీ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ కలకలం!
* ప్రభుత్వ పథకం పేరుతో తల్లికి వల..రూ.లక్షకు చిన్నారి విక్రయం.
* గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన సికింద్రాబాద్‌ పోలీసులు.

సికింద్రాబాద్‌, మహా:

ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఏడు రోజుల ఆడశిశువు అపహరణకు గురికావడం కలకలం రేపింది. ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం అందుతుందంటూ తల్లిని నమ్మించి, ఆమె నుంచి పసికందును దూరం చేసిన ముఠా.. ఆ చిన్నారిని ఏకంగా రూ.లక్షకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

బీహార్‌కు చెందిన ఓ మహిళ ఏడు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిన విషయాన్ని గమనించిన నిందితులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని, ఆ డబ్బులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. ఈ విధంగా మహిళకు దగ్గరైన ముఠా సభ్యులు ఆమెను తమ మాటలతో నమ్మించి పసికందును అపహరించారు.

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సికింద్రాబాద్‌ డీసీపీ రక్షితా మూర్తి ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి పరిసరాలు, నిందితుల కదలికలు తదితర అంశాలపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన వారిలో సరగడ హేమలత, షేక్‌ రిజ్వాన్‌, మహమ్మద్‌ నస్రీన్‌, మహమ్మద్‌ జానీ, షేక్‌ షమీనా బేగం, మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఉన్నారు. చిన్నారిని రూ.లక్షకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? చిన్నారిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలేమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.