పిల్లలపై మమకారం కంటే ధర్మంపై మమకారం ముఖ్యం!
* డ్రగ్స్ మహమ్మారిని అడ్డుకోవాలంటే తల్లిదండ్రులే తొలి కాపలాదారులు.
*పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు హితవు
హైదరాబాద్, మహా:
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను, బాల్యాన్ని కాపాడుకోవడం నేటి సమాజం ముందున్న అతిపెద్ద సవాలని ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే అతిమమకారం ఒక్కోసారి వారి భవిష్యత్తుకు శత్రువుగా మారుతుందని, పిల్లలపై ప్రేమతో పాటు ధర్మం, క్రమశిక్షణ పట్ల నిబద్ధత ఉండాలని హితవు పలికారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో నైతిక విలువల పెంపుదల, కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలపై తనదైన ఆధ్యాత్మిక దృక్పథంతో ప్రసంగించారు.
ఎంత గొప్ప వంశంలో పుట్టినా, ఎంత ఉన్నతమైన కుటుంబ నేపథ్యం ఉన్నా డ్రగ్స్ మహమ్మారి బారిన పడితే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. పిల్లలపై మమకారం కంటే ధర్మంపై మమకారం ఉండాలని స్పష్టం చేశారు. పిల్లలు తప్పు చేసినప్పుడు వారి మనోభావాలు దెబ్బతింటాయనే పేరుతో వెనకేసుకురావడం సరికాదన్నారు. అవసరమైన సందర్భాల్లో కచ్చితంగా ‘నో’ చెప్పగలిగే ధైర్యం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకుల్లో ఉండాలని సూచించారు.
పురాణాల్లోని సగర మహారాజు ఘట్టాన్ని ఉదహరిస్తూ, కుమారుడైన అసమంజసుడు దుర్మార్గపు ప్రవర్తనకు పాల్పడినప్పుడు రాజధర్మానికి ప్రాధాన్యమిస్తూ అతడిని రాజ్యం నుంచి బహిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. కన్నబిడ్డ అనే అనురాగంతో తప్పులను సమర్థించకూడదని, వ్యక్తి ప్రవర్తనలో ధర్మం, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని వివరించారు.
మత్తు పదార్థాల అలవాటు స్నేహితుల ప్రభావంతోనే చాలాసార్లు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. స్నేహితులను సంతోషపెట్టడానికి పార్టీల్లో మద్యం సేవించడం మొదలై, క్రమంగా మరింత ప్రమాదకరమైన మత్తు పదార్థాల వైపు మళ్లుతున్నారని విశ్లేషించారు. పిల్లల స్నేహాలు, ప్రవర్తన, అలవాట్లను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు తెలిసిన మొదటి రోజే తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించి, అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
చెడు అలవాట్లకు ప్రత్యామ్నాయంగా చిన్నతనం నుంచే భక్తి, సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించాలని చెప్పారు. భక్తి మత్తు, సంగీత మత్తు, సాహిత్య మత్తు పిల్లల జీవితాల్లో భాగం కావాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చింతన, సత్సంగం, సద్గ్రంథ పఠనం ద్వారా పిల్లల్లో మంచి ఆలోచనా విధానం, సంస్కారం, వివేకం అలవడతాయని వివరించారు.
విద్యాసంస్థలు కేవలం ర్యాంకులు, మార్కులకే పరిమితం కాకుండా జీవిత సమస్యలను ఎదుర్కొనే ప్రబోధం, వినయం, సంస్కారాన్ని విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. ప్రభుత్వాలు ఎన్ని ప్రచార కార్యక్రమాలు చేపట్టినా కుటుంబ స్థాయిలో మార్పు రానిదే ఆశించిన ఫలితం సాధ్యం కాదని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడటంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, ప్రేమతో కూడిన క్రమశిక్షణ, ధర్మబద్ధమైన జీవన విధానం, ఆధ్యాత్మిక విలువలే యువతను చెడు మార్గాల నుంచి దూరంగా ఉంచగలవని గరికపాటి నరసింహారావు సందేశమిచ్చారు.








