తుఫాన్ ముప్పు పొంచి ఉంది.
* కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి.
* ధాన్యం కొనుగోళ్లపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి.
* మాజీ మంత్రి హరీశ్ రావు.
సిద్దిపేట, మహా.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పరిధిలోని మెట్టు బండల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం రాశులను పరిశీలించిన అనంతరం రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
గత ఏడాది 30 లక్షల టన్నులు.. ఈసారి లక్ష టన్నులు కూడా దాటలేదు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, రాష్ట్రంలో వడ్ల కొనుగోలు జరగక రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని, కానీ ఈ సంవత్సరం ఇప్పటిదాకా కనీసం లక్ష మెట్రిక్ టన్నులు కూడా దాటలేదని ఆయన ఆరోపించారు. గత వానాకాలంలో ఈ సమయానికి ఎన్ని వడ్లు కొన్నారు, ప్రస్తుత వానాకాలంలో ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో పూర్తి లెక్కలతో ప్రభుత్వం తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గ్రేడింగ్ పేరుతో 70 కేంద్రాల మూసివేత దారుణం
సిద్దిపేట జిల్లాలో మౌలిక వసతులు లేవనే సాకుతో ఎల్-2 గ్రేడ్ కేటాయించి 50 ఐకేపీ కేంద్రాలను, 20 ప్యాక్స్ సొసైటీలను కలిపి మొత్తం 70 కొనుగోలు కేంద్రాలను మూసివేయడాన్ని హరీశ్ రావు తప్పుబట్టారు. చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లోని కేంద్రాలు మూతపడటంతో సుమారు 70 గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పెద్దకోడూరు కొనుగోలు కేంద్రంలోనే 63 మంది రైతులు వడ్లు తెచ్చి రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, ఇప్పటిదాకా కేవలం ఆరేడుగురు రైతుల వడ్లు మాత్రమే కాంటా వేశారని, తేమ శాతం వచ్చినా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికీ మిల్లుల అలాట్మెంట్ జరగకపోవడం, గోదాముల ఏర్పాటు లేకపోవడం వల్ల కావాలనే ఆలస్యం చేస్తున్నారని, రైతులు విసిగిపోయి బయట అమ్ముకుంటే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోందని అన్నారు.
మద్దతు ధర దక్కక రైతులకు తీవ్ర నష్టం
ప్రభుత్వ కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు దొడ్డు వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ రూ.2,100 కే అమ్ముకుంటున్నారని, అందులోనూ బస్తాకు 2 కిలోల తరుగు, నగదు చెల్లింపులకు ఒక శాతం కోత పెట్టడంతో రైతు చేతికి రూ.2,000 కూడా దక్కడం లేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కొనుగోలు చేస్తే క్వింటాల్‌కు రూ.2,461 మద్దతు ధర రావాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాల్‌కు రూ.461 చొప్పున ఎకరానికి రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు రైతు నష్టపోతున్నాడని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్లాలకు వడ్లు రాగానే వెంటనే కొనుగోలు చేశామని గుర్తుచేశారు.
సన్న వడ్ల బోనస్‌పై స్పష్టత ఏదీ?
సన్న వడ్ల బోనస్ విషయంలోనూ ప్రభుత్వం రైతులను గందరగోళానికి గురిచేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. మొదట అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పి, తర్వాత 32 రకాలకు కుదించారని, ఇప్పుడు దాన్ని 7 రకాలకు తగ్గించినా ఇంతవరకు జీవో విడుదల కాలేదని ఆరోపించారు. బోనస్‌తో కలిపి క్వింటాల్‌కు రూ.2,961 రావాల్సి ఉండగా, ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు బయట రూ.2,500 నుంచి రూ.2,600 కే అమ్ముకుంటూ క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
తుఫాన్ రాకముందే యుద్ధప్రాతిపదికన కొనాలి
వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో, భారీ వర్షాలు కురిస్తే కల్లాల్లో ఉన్న ధాన్యమంతా తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందని హరీశ్ రావు హెచ్చరించారు. కనీసం టార్పాలిన్ కవర్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి వడ్ల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. సన్న వడ్ల బోనస్‌పై తక్షణమే జీవో విడుదల చేయడంతో పాటు, సిద్దిపేట జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా మూసివేసిన కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి తుఫాన్ రాకముందే ధాన్యమంతటినీ యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.








