కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువైంది!
* ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఏఐసీసీ నిశితంగా పరిశీలిస్తోంది.
* క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే.
* టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్.
హైదరాబాద్, మహా:
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారి విషయంలో క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఏఐసీసీ తగిన సమయంలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ క్రమశిక్షణ, తెలంగాణ నీటి హక్కులపై తన వైఖరిని వెల్లడించారు.
గతంలో కొండా సురేఖ విషయంలోనూ మొదటిసారే చర్యలు తీసుకోలేదని మహేష్‌కుమార్ గౌడ్ గుర్తుచేశారు. ముందుగా పలుమార్లు హెచ్చరించామని, అయినప్పటికీ తీరు మారకపోవడంతోనే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని, ఎవరైనా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. దేనికైనా సరైన సమయం ఉంటుందని, ఈ వ్యవహారంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ నీటి వాటాలో ఒక్క బొట్టు వదులుకోం
తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఒక్క బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదని మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర జల హక్కుల విషయంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పుడూ తెలంగాణ బాగును కోరుకోవని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.








