Mahaa Daily Exclusive

  రిగ్గింగులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..

Share

రిగ్గింగులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
• మున్సిపల్‌ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు అక్రమాలే.
• వీడియోలు విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

తాడేపల్లి, మహా:

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించినవిగా పేర్కొంటూ పలు వీడియోలను కూడా పోస్టు చేశారు.

మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌.. ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌ అంటూ జగన్‌ విమర్శించారు. ఎన్నిక ఏదైనా చివరకు ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌కు గురవుతోందని వ్యాఖ్యానించారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేలు నారా స్వామ్యమని, నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి వస్త్రాపహరణం జరుగుతోందని చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు.

ఏపీలో స్థానిక ఎన్నికల తీరు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల వ్యవస్థకు విరుద్ధంగా ఉందని జగన్‌ ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, దాఖలు చేసిన నామినేషన్లను అధికారులే చించివేయడం, పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి ఓట్లను అపహరించడం, గెలిచిన అభ్యర్థులను ఓడినట్లు ప్రకటించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

తమ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ సుస్థిరంగా, శాంతియుతంగా ఉందని పేర్కొన్న జగన్‌.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హత్యాయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. పెద్దారెడ్డి ఇంటిపై వందలాది మంది దాడికి దిగారని, పోలీసుల సమక్షంలోనే హత్యకు ప్రయత్నించారని, వాహనాలకు నిప్పంటించారని ఆరోపించారు. ఈ ఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగినట్లు పేర్కొంటున్న ఘటనలకు సంబంధించిన వీడియోల్లో కొన్నింటిని ట్వీట్‌కు జతచేసినట్లు జగన్‌ తెలిపారు. ప్రజలే ఆ వీడియోలను పరిశీలించాలని కోరుతూ ‘హే రామ్‌.. సేవ్‌ ఆంధ్ర’ అంటూ తన ట్వీట్‌ను ముగించారు.