• సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌కు శ్రీకారం.
• ఒక్కొక్కరికి రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ.
• తొలి ఏడాది 7 వేల మందికి అవకాశం.
• మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్.
హైదరాబాద్, మహా.
విదేశాల్లో ఉద్యోగం సాధించాలనే ఆశ ఉన్నా.. ఆర్థిక స్థోమత లేక చాలామంది నిరుద్యోగ యువత వెనుకడుగు వేస్తున్నారు. విదేశీ భాష నేర్చుకోవడం, నైపుణ్య శిక్షణ పొందడం, వీసా తీసుకోవడం, విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీమ్’ ను ప్రవేశపెట్టి, విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన యువతకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు నవంబరు 19న జీవో నంబర్ 19 జారీ అయింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు కానుంది. తొలి ఏడాదిలో 7,000 మంది నిరుద్యోగులకు ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
రెండు కేటగిరీలు.. రెండు రకాల ఆర్థిక సాయం.
ఈ పథకంలో విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులను వారి ఉద్యోగ స్వభావం, భాషా అవసరాల ఆధారంగా రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. వీరికి వీసా, విమాన ప్రయాణం కోసం గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు అయ్యే ఖర్చులో 50 శాతం, అంటే గరిష్ఠంగా రూ.50 వేల వరకు సబ్సిడీ ఇస్తారు. రెండో కేటగిరీలో విదేశీ భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో భాషా శిక్షణ, పరీక్షలు, ఉద్యోగానికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని గరిష్ఠంగా రూ.3.50 లక్షల వరకు అయ్యే అర్హత కలిగిన ఖర్చులో 50 శాతం, అంటే రూ.1.75 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. మిగిలిన 50 శాతం ఖర్చును అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో తమ వాటాను చెల్లించలేని వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు టామ్‌కామ్ జాతీయ బ్యాంకులతో సమన్వయం చేయనుంది.
తొలి ఏడాది 7 వేల మందికి అవకాశం.
2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7,000 మందికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 5,880 మందికి విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ అవసరం లేని నేరుగా ఉద్యోగ నియామకాల కేటగిరీలో, మరో 1,120 మందికి విదేశీ భాషా నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల కేటగిరీలో అవకాశాలు కల్పించనున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలు, పని అనుభవం, విదేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలను పరిశీలించి తగిన కేటగిరీని నిర్ణయిస్తారు.
18 నుంచి 40 ఏళ్ల వారికి అర్హత.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు తెలంగాణకు చెందిన స్థానికులై ఉండటంతో పాటు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఐటీఐ అర్హతతో విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారు తెలంగాణలోని గుర్తింపు పొందిన సంస్థల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) ఆదాయ పరిమితికి లోబడి ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత వృత్తిలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అయితే ఉద్యోగం, ఆయా దేశాల వీసా నిబంధనలను బట్టి అనుభవానికి సంబంధించి మినహాయింపులు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే సమయానికి పాస్‌పోర్టు కనీసం ఆరు నెలల గడువుతో చెల్లుబాటులో ఉండటంతో పాటు విదేశీ ఉద్యోగ సంస్థలు నిర్దేశించిన వైద్య పరీక్షల్లోనూ అర్హత సాధించాలి.
మహిళలకు 33.33 శాతం.. దివ్యాంగులకు 5 శాతం.
ఈ పథకంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. మొత్తం లబ్ధిదారుల్లో కనీసం 33.33 శాతం అవకాశాలను మహిళలకు, 5 శాతం రిజర్వేషన్‌ను దివ్యాంగులకు కేటాయించనున్నారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద సబ్సిడీ అందుతుంది. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యుల్లో ఇప్పటికే ఎవరైనా ఈ పథకం ప్రయోజనం పొందారా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తారు. ఒకే కుటుంబం నుంచి పలువురు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒక్కరికే ఆర్థిక సహాయం లభిస్తుంది.
పది రంగాల్లో విదేశీ ఉద్యోగాలు.
విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించేందుకు నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాలు, తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు, రవాణా, లాజిస్టిక్స్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం, మరమ్మతులు, నిర్వహణ, గృహ, వ్యక్తిగత సేవల రంగాలను ప్రభుత్వం గుర్తించింది. విదేశీ నియామక సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఉద్యోగ అవకాశాలను గుర్తించనున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను అరికట్టడంతోపాటు, చట్టబద్ధమైన నియామక మార్గాల ద్వారా యువతను విదేశాలకు పంపించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
విదేశీ భాషల్లో శిక్షణ.. టామ్‌కామ్ బాధ్యత.
ఈ పథకం అమలులో టామ్‌కామ్ కీలక పాత్ర పోషించనుంది. విదేశీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం, ధ్రువీకరణ పత్రాల విషయంలో అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తుంది. ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు గుర్తింపు పొందిన సంస్థలతో కలిసి పనిచేస్తుంది. భాషా పరిజ్ఞానం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లేవారు సంబంధిత భాషలో పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంటుంది. టామ్‌కామ్ ఆధ్వర్యంలో లేదా గుర్తించిన సంస్థల్లో శిక్షణ పొందిన వారికి నిబంధనల ప్రకారం సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే విదేశీ భాషా పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కూడా నిర్దేశిత నిబంధనల మేరకు ప్రయోజనం కల్పిస్తారు.
ఆన్లైన్లోనే దరఖాస్తులు.. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక
ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. టామ్‌కామ్ ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హతలు, పని అనుభవం, నైపుణ్య ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించరు. దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ పనిచేస్తుంది. జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఆర్డీవో లేదా తహసీల్దార్, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు సభ్యులుగా ఉండే ఈ కమిటీ అర్హుల జాబితాను సిద్ధం చేయగా, రాష్ట్రస్థాయి కమిటీ తుది ఆమోదం తెలుపుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన 30 రోజుల్లో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయనున్నారు.
ఉద్యోగం వచ్చిన తర్వాతే సబ్సిడీ చెల్లింపు.
మొదటి కేటగిరీలో ఉద్యోగ నియామక పత్రం, వీసా పొందిన తర్వాత అర్హమైన వీసా ఖర్చులో 50 శాతం సబ్సిడీ అందిస్తారు. విమాన ప్రయాణం పూర్తిచేసి సంబంధిత దేశానికి చేరుకున్న తర్వాత ప్రయాణ పత్రాలను సమర్పిస్తే మిగిలిన అర్హమైన విమాన ప్రయాణ ఖర్చులో 50 శాతం సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. రెండో కేటగిరీ అభ్యర్థులకు భాషా శిక్షణ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత శిక్షణ ఖర్చులో 50 శాతం లేదా ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీ పొందే అవకాశం కల్పించారు. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాలి. పథకంలో నమోదు చేసుకునే ముందు చేసిన ఖర్చులకు సబ్సిడీ వర్తించదు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నకిలీ పత్రాలు సమర్పించినా ఎంపికను రద్దు చేయడంతోపాటు చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారు. విదేశాల్లో ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల పనితీరు, ఉపాధి పరిస్థితులపై ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ఉపాధి కల్పన అధికారులు టామ్కామ్కు నివేదిక సమర్పించనున్నారు.








