Mahaa Daily Exclusive

  మహిళా ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు..! లైంగిక వేధింపుల ఆరోపణలపై అరుల్ విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Share

  •  టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్!
  •  లైంగిక వేధింపుల ఆరోపణలపై అరుల్ విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

చెన్నై, మహా:

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారిణిని లైంగికంగా వేధించారనే ఆరోపణలపై అధికార డీఎంకేకు ప్రత్యర్థిగా ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన కల్లకురిచి ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కల్లకురిచిలోని ఆయన నివాసానికి చేరుకున్న మహిళా పోలీసుల బృందం మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను చూపించి అదుపులోకి తీసుకుంది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.

అసలేం జరిగింది?

కల్లకురిచి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారిణి తనను ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ నవంబరు 23న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనుచిత సందేశాలు పంపడం, బహిరంగ కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదుపై నవంబరు 24న కల్లకురిచి మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 75, 78(2), 132తోపాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు.

మద్రాస్ హైకోర్టు జోక్యంతో వేగం

ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత దర్యాప్తు వేగవంతమైంది. విచారణను సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. తిరుప్పూర్ ఎస్పీ సృష్టి సింగ్‌ను దర్యాప్తు అధికారిగా, ఐజీ ఎన్. కామినిని పర్యవేక్షణ అధికారిగా నియమించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేయడంతోపాటు, జిల్లా స్థాయి అధికారులను కూడా విచారించారు. అదనంగా కాకర్ల ఉష అధ్యక్షతన నలుగురు సభ్యులతో అంతర్గత ఫిర్యాదుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఎమ్మెల్యే ఆరోపణలను ఖండన

మరోవైపు అరుల్ విఘ్నేష్ గతంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రాజకీయ ప్రేరేపితంగా తన ప్రతిష్ఠకు, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి వాస్తవాలను నిర్ధారించాలని న్యాయస్థానం ఆదేశించింది. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.

డిసెంబరు 22లోగా తుది నివేదిక

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, డిసెంబరు 22లోగా తుది నివేదిక సమర్పించాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటకు వెల్లడించరాదని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అభ్యంతరకర సమాచారంపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై మహిళా ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు చేయడం, హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం, తాజాగా అరెస్టు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Latest