హైదరాబాద్, మహా : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విశ్రాంత ఇంజినీర్ల సంఘం సూచించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నీటిని తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని సంఘం ఖండించింది. ఇలా చేస్తే కృష్ణా బోర్డు అవసరం ఏముంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పల్నాడు వాటర్ గ్రిడ్ తాగునీటి కోసమే చేపట్టిన ప్రాజెక్టు అయినప్పటికీ అయితే ఎవరికీ తెలియకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టడం సరికాదని విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీ కనీసం లేఖ రాయకుండా ఉంటే కృష్ణా బోర్డు ఉండి ఏం లాభమన్న ఆయన కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బోర్డుకు లేఖ రాస్తామని చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
కృష్ణా నదిపై ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలను 30 వరద రోజుల ఆధారంగా మార్చుకోవాలని, అందుకు అనుగుణంగా కాల్వలు, జలాశయాల సామర్థ్యం పెంచుకోవాలని శ్యాంప్రసాద్ రెడ్డి సూచించారు. కేఎల్ రావు గణాంకాల ప్రకారం 512, 299 టీఎంసీలు ఉన్నాయని శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం లేకపోవడం, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల కనీసం 299 టీఎంసీల సామర్థ్యాన్ని కూడా వినియోగించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై చేపట్టిన అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకొని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.








