Mahaa Daily Exclusive

  తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ..! రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

Share

  •  13 లక్షల ఇందిరమ్మ ఇళ్లు అడిగితే 2 లక్షలే ఇచ్చారు.
  •  భూ సర్వే పూర్తయితే 26 లక్షల ఎకరాలకు క్లియర్‌ టైటిల్‌.
  •  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

హైదరాబాద్‌, మహా:

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల విషయంలోనూ కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. 13 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరితే కేవలం 2 లక్షల ఇళ్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. కేంద్ర కరువు బృందం రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు మంజూరవుతాయన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై స్పందించారు.

బీఆర్ఎస్‌ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలు తుది దశకు చేరుకున్నాయని పొంగులేటి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫాంహౌస్‌ లెక్కలు, ధరణి వ్యవహారంపై సీఐడీ విచారణ దాదాపు చివరి దశకు వచ్చిందన్నారు. సాంకేతిక అంశాలు, సరైన లెక్కల ఆధారంగా బీఆర్ఎస్‌ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు.

వేగంగా భూ సర్వే.. ఏడాదిన్నరలో పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే వేగంగా కొనసాగుతోందని మంత్రి చెప్పారు. ప్రతి జిల్లాలో సర్వే చేపడుతున్నామని, వచ్చే ఏడాదిన్నరలో రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సర్వే పూర్తయితే భూములకు సంబంధించిన సాదాబైనామా సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. భూముల వివరాలను పక్కాగా నమోదు చేసి, హక్కుల విషయంలో స్పష్టత తీసుకొస్తామని చెప్పారు.

భూ సర్వే పూర్తయిన తర్వాత అటవీశాఖ పరిధిలోని 26 లక్షల ఎకరాలకు క్లియర్‌ టైటిల్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లకు బదులుగా ప్రత్యేక ఖాతా నంబర్లను కేటాయిస్తామని తెలిపారు. భూమి తక్కువగా ఉన్న అర్హులైన వారికి సర్వే ప్రక్రియ చివరి దశలో న్యాయం చేస్తామని పేర్కొన్నారు. సర్వేల పేరుతో బీఆర్ఎస్‌ నాయకులు పగటి కలలు కంటున్నారని, చివరికి లక్ష్యాన్ని తామే సాధిస్తామని వ్యాఖ్యానించారు.

క్యూఆర్‌ కోడ్‌తో వాటర్‌ప్రూఫ్‌ పట్టాదారు పాస్‌బుక్‌లు

భూ యజమానులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన వాటర్‌ప్రూఫ్‌ పట్టాదారు పాస్‌బుక్‌లను ఉచితంగా అందజేయనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. పాస్‌బుక్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సంబంధిత భూమి వివరాలు, మ్యాపింగ్‌ సమాచారం అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భూమి వివరాలను సులభంగా పరిశీలించుకునేలా ఈ విధానం తీసుకొస్తున్నామని చెప్పారు.

రెండు రకాల పాస్‌బుక్‌లు అందించనున్నట్లు మంత్రి వివరించారు. ఒకటి సాధారణ భూముల వివరాలకు, మరొకటి వ్యవసాయానికి సంబంధించిన వివరాలకు ఉంటుందని తెలిపారు. ఈ రెండు పాస్‌బుక్‌లు వేర్వేరు రంగుల్లో ఉంటాయని, వాటిపై భూ యజమానుల ఫొటోలు మాత్రం ఉండవని స్పష్టం చేశారు.

డిసెంబరులో గ్రామాల్లోనే బస

భూ సర్వే పురోగతిపై వచ్చే మంగళవారం నుంచి మూడు రోజులపాటు ప్రతి జిల్లాలో సమీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. డిసెంబరు నుంచి తాను స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తానని, రాత్రివేళల్లోనూ అక్కడే బస చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు. భూములకు సంబంధించిన సమస్యలు, రికార్డుల్లో ఉన్న తప్పులు, సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజల నుంచి నేరుగా వివరాలు సేకరిస్తానన్నారు.

ఈ డిసెంబరు నాటికి 2,300 గ్రామాల్లో భూ సర్వే పూర్తవుతుందని పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తయిన తర్వాత భూముల వివరాలు స్పష్టంగా అందుబాటులోకి వస్తాయని, భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు. తెలంగాణ భూ సర్వే దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Latest