Mahaa Daily Exclusive

  డ్రగ్స్‌ మత్తులో యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.. లక్ష్యంపై గురిపెట్టి ముందుకు సాగాలి..: మెగాస్టార్‌ చిరంజీవి.

Share

  •  లక్ష్యంపై గురిపెట్టి ముందుకు సాగాలి.
  •  మెగాస్టార్‌ చిరంజీవి.
  •  40 కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి మహా పాదయాత్ర.
  •  ముగిసిన ‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషా ముక్త్‌ భారత్‌’

హైదరాబాద్‌, మహా:

యువత డ్రగ్స్‌కు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఉండాలని, దాన్ని సాధించే క్రమంలో వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తులపై వ్యతిరేకత చూపడం కాకుండా, వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసి మంచి మార్గంలో నడిపించాలని అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషా ముక్త్‌ భారత్‌’ మహా పాదయాత్ర శుక్రవారం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో చిరంజీవి ప్రసంగించారు.

48 ఏళ్ల క్రితం తాను 22 ఏళ్ల యువకుడిగా ప్రసాద్‌ పేరుతో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటుడిగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నానని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. చెన్నైలోని పాండీ బజార్‌లో సినిమా రంగానికి చెందినవారు ఎక్కువగా ఉండేవారని, అక్కడ పరిచయాలు పెంచుకోవాలంటే మద్యం తాగాలని కొందరు సూచించారని చెప్పారు. అయితే తాను ఆ అలవాటుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి తప్పుకున్నానన్నారు. ఒకసారి ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే అది మరో వ్యసనానికి దారితీసే ప్రమాదం ఉందని, చివరకు మన లక్ష్యానికి గొడ్డలిపెట్టుగా మారుతుందని ఒక పెద్దాయన చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని తెలిపారు.

“ఆ రోజు నుంచి నా దృష్టంతా నా లక్ష్యం, నా భవిష్యత్తుపైనే పెట్టాను. అలా ప్రయాణిస్తూ ఇన్నేళ్ల తర్వాత మీ ముందుకు మెగాస్టార్‌గా వచ్చాను. నాకు నా లక్ష్యమే ప్రధానం. మీలో చాలామంది జీవితంలో ఏదో ఒక రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటుంటారు. హీరోలంటే కేవలం సినిమా హీరోలు మాత్రమే కాదు. మీరు ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థానానికి చేరుకుని హీరోలుగా నిలవాలి” అని చిరంజీవి అన్నారు.

ప్రతి ఒక్కరికీ ఉన్నత లక్ష్యం ఉండాలని, అయితే ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో డ్రగ్స్‌ పెనుభూతంలా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు సైతం మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఎవరూ కావాలని డ్రగ్స్‌కు బానిసలు కావాలని అనుకోరని, కొందరు స్నేహితుల పరిచయాల ద్వారా మొదలయ్యే అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుందని వివరించారు. చివరకు వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోలేక జీవితాన్ని నాశనం చేసుకుంటాడని హెచ్చరించారు.

“డ్రగ్స్‌కు బానిసైతే మీ కుటుంబాన్ని రోడ్డున పడేసినవారవుతారు. జీవితం ఒక్కసారే వస్తుంది. దాన్ని సార్థకం చేసుకోవాలి. మన తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడేలా ఎదగాలి. మన కుటుంబానికి, సమాజానికి, దేశానికి వెన్నెముకగా నిలవాలి. మన విజయం మన కుటుంబ విజయమే కాదు.. మన చుట్టూ ఉన్న ఎంతోమందిని అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం కూడా కల్పిస్తుంది” అని చిరంజీవి పేర్కొన్నారు.

భారత్‌లో యువత సంఖ్య అధికంగా ఉందని, ఆ యువశక్తి సరైన దిశలో ప్రయాణిస్తే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఎవరితరం కాదని అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లే సామర్థ్యం యువతకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌కు బానిసైన స్నేహితులను దూరం పెట్టకుండా వారిపై జాలి చూపాలని చిరంజీవి సూచించారు. “మన వ్యతిరేకత వ్యక్తిపై కాదు.. డ్రగ్స్‌పై ఉండాలి. వ్యసనానికి బానిసైన స్నేహితుడిని గుర్తించి, అవసరమైతే పునరావాస కేంద్రంలో చేర్పించాలి. అతడు తిరిగి మంచి మార్గంలో నడిచేలా సహకరించాలి. ఒకరి జీవితాన్ని కాపాడటం కూడా సమాజానికి మనం చేసే సేవే” అని చెప్పారు.

40 కిలోమీటర్ల మేర పాదయాత్ర

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నవంబరు 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు నిర్వహించిన ‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషా ముక్త్‌ భారత్‌’ పాదయాత్ర నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా సుమారు 40 కిలోమీటర్లు సాగి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది. ఈ యాత్రలో యువత, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 220 పాఠశాలలు, 52 జూనియర్‌ కళాశాలలు, 30 ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన సుమారు 43 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

సినీ రంగం నుంచి అక్కినేని నాగార్జున, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు సాయికుమార్‌, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తదితరులు యాత్రకు సంఘీభావం తెలిపారు. బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ముగింపు సభకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. డ్రగ్స్‌ రహిత హైదరాబాద్‌, మత్తుపదార్థాల రహిత భారత్‌ నిర్మాణానికి సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేయాలన్న సందేశంతో పాదయాత్ర ముగిసింది.

Latest