పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటపై ఎట్టకేలకు థియేటర్ యాజమాన్యం స్పందించింది. చిక్కడపల్లి పోలీసులు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చింది. 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు థియేటర్ యాజమాన్యం పంపించింది. సంథ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది. గత 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని.. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్‌లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం తన రిప్లైలో పేర్కొంది. 4, 5 తేదీల్లో థియేటర్‌ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందన్నారు. గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్‌లో సినిమాలకు వచ్చారన్నారు. ఇకపోతే సంధ్య థియేటర్‌లో ఫోర్ వీలర్స్, టూ వీలర్స్‌కి ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా ఉందని ఈ రిప్లైలో థియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది.
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 4వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌కు హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా వచ్చారు. హీరోయిన్, మిగతా చిత్రబృందం కూడా థియేటర్‌కు వచ్చింది. సెలబ్రిటీస్‌ను చూడటానికి అభిమానులు పోటెత్తడంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె కొడుకు శ్రీతేజ్ స్పృహ తప్పి పడిపోయాడు. బ్రెయిన్‌కి ఆక్సీజన్ అందకపోవడంతో కోమాలోకి వెళ్లాడు. ప్రస్తుతం శ్రీతేజ్‌కు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో పాటు ఘటన సందర్భంగా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణపై థియేటర్ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు యాజమాన్యం సుదీర్ఘ సమాధానం ఇచ్చింది. సెక్యురిటీ సిబ్బందికి సంబంధించిన ఏజన్సీతో పాటు గతంలో థియేటర్ కు వచ్చిన హీరోలు, సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలను లేఖలో యాజమాన్యం పొందుపరిచింది.








