తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట పైన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన పైన ఇప్పటికే ప్రధాని సహా పలువురు ముఖ్య నేతలు స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. కాగా, బాధితులను పరామర్శించేందుకు జగన్ తిరుపతి వెళ్తున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి వైఎస్ జగన్ రానున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను మాజీ సీఎం పరామర్శించనున్నారు. జగన్ తిరుపతి రాబోతున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కాగా.. వైకుంఠ ఏకదాశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద గత అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. మొత్తం మూడు కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పరిస్థితి విషమంగా మారింది. మొత్తం ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడగా రియా, స్విమ్స్ ఆస్పతులలో చికిత్స పొందుతున్నారు.
ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చ కు కారణమైంది. ఈ సమయంలో జగన్ తిరుమలకు వెళ్లాలని ప్రయత్నించారు. కాగా, డిక్లరేషన్ వివాదంతో ఆగిపోయారు. ఇక, ఇప్పుడు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని పరామర్శించటం తో పాటుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం జగన్ తిరుపతిలో బాధితులను కలవనున్నారు. ఘటన పైన విచారణ కు వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి.. క్షతగాత్రులకు జగన్ పార్టీ తరపున ఆర్దిక సాయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.








