మన మూలాలను మరచిపోకూడదని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. మన మూలాల్లో గొప్ప సంస్కృతి ఉందని, గొప్ప సామాజిక, ధార్మిక విలువలున్నాయన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని మరవకూడదని, మనం తెలుగువారం, తెలుగులోనే మాట్లాడుకుందామన్నారు. ఇంగ్లిష్ భాష నేర్చుకోవచ్చు, ఆ భాషలో మాట్లాడవచ్చు. కానీ ఇంగ్లిష్ వారిలా మారవద్దన్నారు. వారి సంస్కృతికి బానిసలు కావద్దని స్పష్టం చేశారు. పండగలు సమైక్యతా భావాన్ని బోధిస్తాయని వెంకయ్యనాయుడు చెప్పారు. సంక్రాంతి పండగ అంటే ప్రకృతిని పూజించే, ప్రృకృతిని ఆరాధించే, ప్రకృతిని ప్రేమించే పండగ అని అన్నారు. చీమలకు చక్కెర పెట్టి, పశువులకు దండం పెట్టే సంస్కృతి మనదని, ఆ సంస్కృతిని మరవద్దని సూచించారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి అని, సూర్యుడే మన జీవితానికి వెలుగు అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఉదయం తలుపు తీయగానే సూర్యుడి కిరణాలతో ఇంట్లోకి వెలుగు వస్తుంది. అలాగే సూర్యుడితో మన జీవనం మమేకమయితే మన జీవితంలోకి వెలుగులు వస్తాయి. పిల్లలందరూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. సూర్యరశ్మి వంటికి తగలాలి అని చెప్పారు. అందరూ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అప్పుడు అంతా మంచే జరుగుతుందని అన్నారు.
సంక్రాంతి సందర్భంగా మన ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను చేరవేసేందుకు, మన పెద్దల వైభవాన్ని తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ 10 అంశాల మీద దృష్టి పెట్టాలన్నది తన ఆకాంక్ష అని మన మూలాలకు తరలి వెళదాం. భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేద్దాం. సేవా కార్యక్రమాల్లో పాల్గొందామన్నారు. పాశ్చాత్య జీవనాన్ని అనుకరించటం మానుకుని, భారతీయులుగా జీవనం సాగిద్దామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడే మన సంప్రదాయ ఆహారమే తీసుకుందామని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెంచి, రసాయనాల వాడకాన్ని విడనాడుదామని పిలుపునిచ్చారు. మన భారతీయ మాతృభాషలను గౌరవించి, ప్రోత్సహించి, మాతృభాషా పరిరక్షణకై ఉద్యమిద్దామన్నారు. మన సంపన్నమైన సామాజిక వ్యవస్థను సమగ్ర రూపానికి తీసుకువచ్చిన కుటుంబ వ్యవస్థను కాపాడుకుందామన్నారు. సంపదను పెంచుకుంటూ అందులో కాస్త ఇతరులతో పంచుకుందామని సూచించారు. ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతితో కలిసి జీవిద్దాం. వ్యాయామం చేద్దామన్నారు. మన ఆట, మన పాట, మన బాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు మరచిపోకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మనము మన బాధ్యతలను, కర్తవ్యాలను, పనులను నిర్వర్తించి దేశ భవిష్యత్తుకు సహకరిద్దామని సూచించారు.
ఈ సందర్భంగా సంక్రాంతి ప్రాశస్త్యాన్ని ఆధ్యాత్మిక, లౌకిక కోణంలో శతావధాని ఆముదాల మురళి వివరించారు. తెలుగు జానపద వైభవాన్ని, సంక్రాంతి వైభవాన్ని కళ్ళకు కట్టేలా తమ గానము, జానపద నృత్య ప్రదర్శనతో డాక్టర్ లింగా శ్రీనివాస్ బృందం అలరించింది. తెలుగు పద్యగానంతో చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ అలరించాడు. స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ వందన సమర్పణ చేశారు. ఈ సంబరాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, వై.ఎస్.చౌదరి, డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి, ప్రముఖ చలనచిత్ర నటుడు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.








