ఢిల్లీలో ఈసారి బీజేపీదే అధికారమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు 2,500 అందుకుంటారని చెప్పారు. ఆర్కేపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆప్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో ఏ ఒక్క గుడిసెను తొలగించబోమని, అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యం రంగంలోనూ ‘ఆపద’ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ప్రజలను దోచుకున్నవారు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. ‘వసంత పంచమి తర్వాత వాతావరణంలో మార్పు ప్రారంభమవుతుంది. 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 5న దిల్లీలో అభివృద్ధికి సంబంధించిన కొత్త వసంతం రానుంది. ఈ సారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఓటింగ్‌కు ముందే చీపురు పుల్లలు ఎలా ఊడుతున్నాయో చూస్తున్నాం. ఆప్ నాయకులు ఆ పార్టీని వదిలివెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆప్‌పై ప్రజలు ఎంత నిరాశతో ఉన్నారో, ఎంత వ్యతిరేకత ఉందో వారికి తెలుసు’ అని మోదీ అన్నారు.
ఒక్క మురికివాడను కూడా కూల్చం
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఢిల్లీలోని ఒక్క మురికివాడను కూడా కూల్చమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను లక్ష్యంగా చేసుకుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ప్రధాని కొట్టివేశారు. ఒక్క మురికివాడను కూడా తాము కూల్చే ప్రసక్తి లేదన్నారు. ఆప్ తమ ప్రకటనతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని, తాము ప్రచారం కోసం ప్రకటనలు చేయమని, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు బడ్జెట్‌లో వెసులుబాట్లు కల్పిస్తామని మోదీ పేర్కొన్నారు.








