మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి జాతర. ఇది మహాశివరాత్రి పౌర్ణమి రోజున రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు భక్తులు కోటికి పైగా తరలివస్తారు. ఈ వన దేవతలను దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. 2025 ఫిబ్రవరి 12 నుంచి మేడారం మినీ జాతర జరగనుంది. నాలుగు రోజులపాటు ఈ మినీ జాతర కొనసాగనుంది. రెండేళ్లకోసారి మేడారం మహా జాతర జరుగుతుండగా అధిక సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 12,13,14,15వ తేదీల్లో మినీ జాతర నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఆలయ పూజారులు దేవాదాయ శాఖకు లేఖ రాశారు. నాలుగురోజుల పాటు జరిగే మినీజాతరకు దాదాపు 20లక్షల మంది హాజరయ్యే అవకాశముంది.








