అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య రంగంలో సరికొత్త యుద్దం తీసుకొచ్చారు. ట్రంప్ ముందునుండీ చెప్పినట్లుగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనెడాలతోపాటు చైనాపై కూడా సుంకాల కొరడాను ఝుళిపించారు. మెక్సికో, కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25 శాతం సుంకం, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనా, మెక్సికో, కెనడా దేశాలు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు . ట్రంప్ చెప్పినంత పని చేయడంతో ఉలిక్కిపడిన కెనెడా, మెక్సికో ప్రతీకార చర్యలకు దిగాయి. దేశాల మధ్య వాణిజ్యవార్ ప్రపంచప్రజలపై పెనుప్రభావం చూపనుంది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, అమెరికా ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధిస్తామని ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ కూడా వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని తెలిపారు. చైనా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ లో ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. ట్రంప్ చర్య వల్ల అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్నది పక్కన పెడితే, ఈ వాణిజ్య యుద్ధం వల్ల ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు ఎదురవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి, అమెరికన్ల జీవనం కష్టతరమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ప్రతీకార చర్యలకు దిగితే, ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంది. ట్రంప్ తాజా సుంకాలు విధించేందుకు వీలుగా ముందు జాతీయ ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించారు. ఆ తర్వాత, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై అసాధారణ సుంకాలు విధించారు. ఈ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి. “అమెరికన్లను రక్షించడానికి ఈ సుంకాలు అవసరం. ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకోవడానికి మెక్సికో, కెనెడా, చైనాలపై ఒత్తిడి పెంచడమే ఈ చర్యల లక్ష్యం” అని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ అకౌంట్ లో పేర్కొన్నారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే సహజ వాయువు, చమురు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకం మాత్రమే విధించనున్నట్లు ట్రంప్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే, సుంకాలను మరింత పెంచేందుకు వీలుగా ఈ ఉత్తర్వులో ప్రత్యేక నిబంధనను చేర్చారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టడానికి ఈ ఇబ్బందులను తట్టుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా చర్యపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. అఫ్ఘానిస్తాన్లో అమెరికా సైన్యానికి మద్దతుగా కెనడా సైన్యం కూడా పోరాడిన సంగతి గుర్తుచేశారు. అగ్నిపర్వతాలు బద్దలైన వేళ, హరికేన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అమెరికాకు అండగా కెనడా నిలిచిందన్నారు. తాము చేసిన సాయానికి ఇదే ప్రతిఫలమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై కెనడా కూడా 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇందులో 3 వేల కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలినవాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి పలు ఉత్పత్తులు ఈ సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. మొత్తంగా అటు ట్రంప్ మొదలుపెట్టిన తుంటరి ఆటతో ఇటు కెనడా, మెక్సికో, ఇంకోవైపు చైనా కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం ప్రదర్శిస్తున్నాయి. ఇంతకింతా అనుభవిస్తారంటూ శాసనార్ధాలు పెడుతున్నారు. పనామా కాలువపై కూడా కన్నేసి ట్రంప్ చేస్తున్న హంగామాకు కొదువేలేదు. ట్రంప్ చర్యల వల్ల దేశంలో ఇంధన ధరలు పెరిగే ముప్పుందని అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ హెచ్చరించింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ట్రంప్ చర్యను విమర్శించింది. ఈ వాణిజ్య యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని యేల్ యూనివర్సిటీలోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. ఎన్నికల ప్రచారంలో నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇళ్ల ధరలు తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ ఈ వాణిజ్య యుద్ధం వల్ల ధరలు పెరిగే ముప్పు ఎదురవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఉత్తర్వును డెమోక్రాట్లు తప్పుబట్టారు. అయితే, దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ చర్యల ద్వారా నిలబెట్టుకున్నట్లు ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. యురోప్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే కంప్యూటర్ చిప్స్, ఉక్కు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలపై కూడా సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. ఇండియా నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై సుంకాలు పెంచలేదు. ఇటీవలే ఆయన బ్రిక్స్ దేశాలపై సుంకాలు, ఆంక్షలు విధించే అవకాశముందని కూడా చెప్పారు. బ్రిక్స్ దేశాలలో చైనా, భారత్, రష్యా, బ్రెబిల్ ప్రధానమైనవి. అయినప్పటికీ భారతదేశంపై చర్యలు తీసుకోలేదు. ట్రంప్ సుంకాల జాబితా మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది. అయితే ట్రంప్ సుంకాలు విధిస్తే మేం తక్కువ తిన్నామా అని అవీ విధించే అవకాశాలున్నాయి. పలితంగా మళ్ళీ ప్రపంచంలో ఆర్ధిక ఆందోళనలు, వాణిజ్యయుద్దాలు సంభవించే ప్రమాదాలు పొంచి ఉన్నాయి.








