ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గాంధీభవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయని బీఆర్ఎస్ బలం అంతా కూడా బీజేపీ సపోర్ట్ చేసిందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఆ రెండు పార్టీలు కలిసి ఓడించాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ ఇచ్చామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసీ రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయా? అని ప్రశ్నించారు. త్వరలో మరో పండగ వస్తుందని అప్పుడు మేము బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గెలిచిందా? అని ప్రశ్నించారు. తనకు పార్టీ మద్దతు ఉందని రవీందర్ సింగ్ ప్రచారం చేశారు. పరోక్షంగా రవీందర్ సింగ్ కు బీఆర్ఎస్ బలపరిస్తే మీ శక్తి ఇంతేనా? అని నిలదీశారు. రవీందర్ సింగ్కు వచ్చిన ఓట్లు ఆయన వ్యక్తిగతం అని బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి పడ్డాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలవడమనేదే వాళ్ల పార్టీ పతనానికి మొదటి అడుగు అని శ్రీధర్ బాబు అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య బంధాన్ని పలపర్చుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా శ్రమించారన్నారు.







