దేశంలో ఉగ్రవాద దాడులు అంతరించాయని, నక్సలిజం కూడా చివరి దశకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అడవుల నుంచి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతోంది. అయితే, పట్టణ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తోందని, కొన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతాలు నక్సలిజం భావజాలాన్ని ప్రతిబింబిస్తున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. గురువారం ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. భద్రత విషయంలో తమ ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తోంది. గతంలో 100 జిల్లాలు నక్సలిజం ముప్పుతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే, ఈ సంఖ్య నేడు 12 జిల్లాలకు పరిమితమైంది. అట్టడుగు స్థాయి వరకూ పాలన అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతో ఇది సాధ్యమైందన్నారు. నిర్ణయాత్మక చర్యల కారణంగా నక్సలిజం అడవుల నుంచి క్రమంగా నిర్మూలించబడింది. కానీ ఇది కొత్త సవాలు సూచిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోకి దాని మూలాలను విస్తరించడం ప్రారంభించింది అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షలను అణచివేసిందన్నారు. ఆ పార్టీ నుంచి ప్రజలు కూడా పెద్దగా ఆశించడంలేదన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దశాబ్ద కాలంలో ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయన్నారు. భారత్ ప్రపంచ వృద్ధిని నడిపిస్తోందని మోదీ పేర్కొన్నారు.







