Mahaa Daily Exclusive

  అమెరికాకు కరెంటు కోతలు కెనడా రివేంజ్ …!

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిక్కనిర్ణయాలతో ప్రపంచంలోని దేశాలకు సుంకాల దరువువేస్తుండగా, ఇతర దేశాలు కూడా మేం తగ్గేదెలే అంటూ షాకులిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, మిత్రులు, శత్రువులు అని తేడా లేకుండా ట్రంప్ అందరిపైనా సుంకాలు విధించడం ప్రారంభించారు. ఇప్పుడు పొరుగు దేశమైన కెనడా పైనా 25 శాతం టారిఫ్ విధించారు. దీనికి ప్రతిస్పందనగా కెనడా పెద్ద రివేంజ్ కు ప్లాన్ చేసింది. యుఎస్ పై ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ తో ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా పై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో కెనడా ఇంధన ఎగుమతులపై 10 శాతం టారిఫ్ ఉంది. ఈ నిర్ణయాలు కెనడా నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. తాము ఆర్థికంగా దెబ్బతింటున్నామని చూస్తూ కూర్చోబోమని డగ్ ఫోర్డ్ స్పష్టం చేశారు. ‘‘వారు ఒంటారియోను ధ్వంసం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోను. చిరునవ్వుతోనే చేయాల్సిందంతా చేస్తాను. కరెంట్ కోతలు విధిస్తాను. ఒంటారియోతో స్టార్లింక్ కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను. అది పూర్తయింది. ఆయన కెనడా ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారు. మా స్టోర్ల నుంచి యుఎస్ ఆల్కహాల్ ను తొలగించాలని యోచిస్తున్నాం’’ అని ఫోర్డ్ వెల్లడించారు. అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళ్తున్నాయి. కెనడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రోపవర్, సహజ వాయువు, ఎలక్ట్రిసిటీ పై యుఎస్ ఆధారపడింది. ‘‘వారు మా ఇంధనంపై ఆధారపడ్డారు. వాళ్లు కూడా నొప్పి భరించాలి’’ అని ఫోర్డ్ వ్యాఖ్యలు చేశారు. చిరకాల మిత్ర దేశంపై ట్రంప్ అసలు సుంకాలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ‘‘సన్నిహిత మిత్రులు, పొరుగువారిపై ఎందుకు దాడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కెనడా పై సుంకం అంటే అమెరికన్ల పై పన్ను విధించడం కిందికే వస్తుంది’’ అన్నారు.