Mahaa Daily Exclusive

  బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మెగా ట్విస్ట్ .. రంగంలోకి ఈడీ..!

Share

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసులకు కక్కుర్తి పడి వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోన్న బెట్టింగ్ యాప్స్‎కు ప్రమోషన్లు చేస్తోన్న సెలబ్రెటీలపై ఇప్పటికే పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే 11 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు. వీరికి నోటీసులు జారీ చేసి.. విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విష్ణుప్రియ, తేజలను విచారణకు పిలవగా, విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్ లో విచారణకు డుమ్మాకొట్టింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చేరింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్న ఈడీ.. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై విచారిస్తోన్నట్లు తెలిసింది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోన్న ఈడీ.. పోలీసులు కేసు నమోదు చేసిన 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోన్నట్లు టాక్. ఈడీ ఎంట్రీతో ఈ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. కాగా, బెట్టింగ్ యాప్‎లు ప్రమోషన్ చేస్తున్న 11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్‎లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నెటిజన్లు ప్రమోషన్ చేసిన స్టార్లను వెతికిమరీ నెట్టింట పెడుతున్నారు. ఈ క్రమంలోనే మంచులక్ష్మి, నిధి అగర్వాల్ పైనా చర్యలు తీసుకోవాలని ప్రమోఫన్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాజల్ అగర్వాల్ వీడియోలు పోస్ట్ చేసినా ఆమెపై కేసు పెట్టలేదు. తెలుగు సెలబ్రిటీలపైనే పోలీసులు కేసులు పెడుతున్నారు. యాప్ లను నిషేదించకుండా కేవలం తెలుగు సెలబ్రిటీలపైనే కేసులు పెడుతుండడంపై చర్చ జరుగుతోంది.