రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. సుమారు గంటలకుపైగా జరిగిన ఈ చర్చలు ముగిశాయని శ్వేతసౌథం, క్రెమ్లిన్ ధ్రువీకరించాయి. కానీ ఇరువురు నేతలు ఏం మాట్లాడారో మాత్రం వెల్లడించలేదు. పుతిన్‌తో తాను మాట్లాడదలుచుకున్న వివరాలను ట్రంప్ ముందుగానే వెల్లడించారు. పుతిన్‌తో తాను మాట్లాడతానని, భూమి, విద్యుత్కేంద్రాల గురించి, కొన్ని ఆస్తుల విభజనపైనా ఇరువురం చర్చిస్తామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. పుతిన్ దీనికి అంగీకారం తెలుపుతూనే, కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిపై ట్రంప్‌తో మాట్లాడతానని పుతిన్ ఇంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చర్చలు కూడా ముగిశాయి.







