- కొనసాగుతున్న చలి తీవ్రత
- తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
- సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, మహా : తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో శీతల గాలులు వీస్తుండగా మరికొన్నిచోట్ల మంచు తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్నిచోట్ల ఉదయం, రాత్రి సమయంలో మంచు కురుస్తోంది. ఉదయం సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎల్లో హెచ్చరికలు జారీ
రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలుచోట్ల శీతల గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడకక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతల గాలులు వీచే ఛాన్స్ ఉండగా… ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. శుక్రవారం ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక హైదరాబాద్ లోని వాతావరణం చూస్తే ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో గంటకు 4-6 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
గజగజకు ఆదిలాబాద్ లో పాఠశాలల సమయాలు మార్పు
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలి తీవ్రతకు గ గజ వణికిపోతుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల సమయాలను సవరించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తరగతులు ఉదయం ఆలస్యంగా ప్రారంభమవుతాయి. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
చలి వాతావరణం కారణంగా విద్యార్థుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి ఉదయం 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు కాకుండా ఉదయం 9.40 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలు సమయాలను తక్షణమే పాటించాలని ఆదేశించారు. సూచనలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించనున్నట్టుగా తెలిపారు.








