* సిఎం రేవంత్ రెడ్డితో ఆర్బిఐ గవర్నర్ మర్యాదపూర్వక భేటీ.
* తెలంగాణ ఆర్థిక విధానాలపై ఆర్బీఐ గవర్నర్ ప్రశంసలు.
* అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని కోరిన ఆర్బీఐ అధిపతి.
* ముఖ్యమంత్రి, ఆర్బీఐ గవర్నర్ మధ్య కీలక చర్చలు.
* సౌర విద్యుత్ , నూతన రుణ విధానాలపై ఆర్బీఐ గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ పాలక మండలి సమావేశం జరిగిన నేపథ్యంలో, ఆ సంస్థ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలు మరియు భవిష్యత్తు ప్రణాళికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు , ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభినందించారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణను పాటించడంతో పాటు వృద్ధి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో తాము తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను గవర్నర్కు వివరించారు. ముఖ్యంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మూడవ విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఖర్చును తగ్గించుకునే దిశగా సౌర విద్యుత్ వినియోగాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెంచేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అక్రమంగా డిపాజిట్లు సేకరించి ప్రజలను మోసగించే సంస్థల నుండి సామాన్యులను రక్షించేందుకు ‘బడ్స్’ చట్టాన్ని అధికారికంగా నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్ ముఖ్యమంత్రిని కోరారు. ప్రజల కష్టార్జితానికి రక్షణ కల్పించే ఈ చట్టం అమలు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు రిజర్వ్ బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన సమగ్ర రుణ అనుసంధాన ప్రక్రియ గురించి, తద్వారా సామాన్యులకు సులభంగా రుణాలు అందే విధానంపై సీఎంకు వివరించారు. బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన డిపాజిట్ల విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలతో ముందుకు వెళ్లాలని, ఇందుకు కేంద్ర బ్యాంక్ తరపున పూర్తి సహకారం ఉంటుందని గవర్నర్ ఆకాంక్షించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకులు చిన్మోయ్ కుమార్, ప్రధాన నిర్వాహకులు మేజర్ యశ్పాల్ చరణ్, పాణిగ్రాహి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








