- ఐబొమ్మ రవికి షాక్
- బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు
- పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి
హైదరాబాద్, మహా : పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన 5 వేర్వేరు కేసులకు సంబంధించి రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఈ కేసుల దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ మంజూరు చేయడం సరి కాదని బుధవారం ఇమంది రవి బెయిల్ పిటిషన్ల విచారణలో పోలీసులు కోర్టుకు విన్నవించారు.
కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
ఐబొమ్మ రవి పిటిషన్ల విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఇమంది రవికి విదేశీ పౌరసత్వం ఉందని, అతడికి బెయిల్ ఇస్తే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు అతడికి బెయిల్ ఇవ్వడం దర్యాప్తుకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. కేసులో సాక్ష్యాలను లేకుండా చేయడం, డేటా రిమూవ్ చేయడం లాంటి ఎన్నో సాంకేతిక అంశాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సినీ పరిశ్రమకు సవాలుగా మారిన ఐబొమ్మ వెబ్ సైట్
తెలుగు సినీ పరిశ్రమతో పాటు పోలీసులకు ఐబొమ్మ వెబ్‌సైట్ అతిపెద్ద సవాలుగా మారింది. కొత్త సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే హైక్వాలిటీ ప్రింట్లను ఉచితంగా అందుబాటులోకి తెస్తూ ఈ పైరసీ వెబ్ సైట్ అటు సినీ నిర్మాతలు, సినీ పరిశ్రమతో పాటు మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి కొట్టింది. ఐబొమ్మ వంటి సైట్లపై నిఘా ఉంచడానికి చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేక ‘యాంటీ పైరసీ సెల్’ను ఏర్పాటు చేసింది. కొన్ని నెలల కిందట దమ్ముంటే పట్టుకోండి.. మిమ్మల్ని టచ్ చేస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందని అటు సినీ పరిశ్రమతో పాటు పోలీసులకు సైతం ఐబొమ్మ నిర్వాహకులు ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో నిందితుడు రవిని గుర్తించి, పక్కా ప్లాన్‌తో పోలీసు అధికారులు అతడిని పట్టుకున్నారు.
కాపీరైట్ చట్టం ప్రకారం సినిమా పైరసీకి పాల్పడటం తీవ్రమైన నేరమని తెలిసిందే. దాంతోపాటు ఈ సైట్ ద్వారా పలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మరిన్ని తప్పిదాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి భారీ జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓవరాల్ గా మరిన్ని సెక్షన్ల కింద నమోదైన కేసులు కనుక దోషి అని తేలితే మరిన్ని సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించక తప్పదని అధికారులు చెబుతున్నారు.
కొన్ని రోజుల నుంచి ఐబొమ్మ రవిని విచారిస్తున్నారు. పలుమార్లు కస్టడీకి తీసుకుని విచారించినా ప్రయోజనం ఉన్నట్లు కనిపించడం లేదు. నిందితుడు సమాచారాన్ని దాచే ప్రయత్నం చేస్తుండటంతో పదే పదే కస్టడీకి తీసుకోవాల్సి వస్తోంది. తాజాగా కస్టడీ ముగియడంతో అతడి బెయిల్ పిటిషన్లపై విచారణ జరగగా, నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవి పిటిషన్లను కొట్టివేసింది.








