Mahaa Daily Exclusive

  మున్సిపల్ ఎన్నికలు ….జనసేన అధినేత పవన్ పర్యటన రద్దు

Share

  • మున్సిపల్ ఎన్నికలు
  • జనసేన అధినేత పవన్ పర్యటన రద్దు
  • ప్రచారానికి రెండు రోజులే గడువు
  • షెడ్యూల్ ఇబ్బంది వల్లే పర్యటన రద్దన్న బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, మహా : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. పలుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. జనసేన – బీజేపీ పార్టీల ప్రకటన ప్రకారం శని, ఆదివారాలలో పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో పవన్ పర్యటన రద్దు అయింది. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో షెడ్యూల్ లో ఇబ్బందుల కారణంగా కళ్యాణ్ పర్యటన రద్దు చేసినట్లు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు.

ఇక పవన్ పర్యటన ఖరారైన వెంటనే తెలంగాణలోని అధికార కాంగ్రెస్ నుంచి మాటల దాడి మొదలైంది. గతంలో కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలను తెరపైకి తీసుకువచ్చారు. ఇటీవలే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో తెలంగాణ గురించి చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌లు ప్ర‌జ‌లు మ‌ర్చిపోయార‌ని తాను అనుకోవ‌ట్లేద‌న్నారు. దిష్టి వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చిన త‌ర‌వాత‌నే ప‌వ‌న్ ప్ర‌చారం చేయాల‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర మోక‌రిల్లాల్సిన ప‌రిస్థితి బీజేపీకి ఎందుకు వ‌చ్చింద‌ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇతర నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల మధ్యనే పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే షెడ్యూల్ ఇబ్బందుల కారణంగానే పవన్ టూర్ రద్దు అయిందని జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఇటీవలే కొండగట్టు పర్యటనకు వచ్చిన సమయంలోనే మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈసారి తప్పకుండా పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణలోని నాయకత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ తరపున పలుచోట్ల నామినేషన్లను కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 336 వార్డుల్లో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ జనసేన నాయకత్వం ప్రకటించింది.