Mahaa Daily Exclusive

  మున్సిపల్ ఎన్నికలు: స్థానిక సమస్యలు మాయం.. రాజకీయ విమర్శలే ప్రధానాస్త్రం

Share

  • పురపోరులో గల్లీ సమస్యలు మాయం
  • సీఎం రేవంత్ ఉచ్చులో విపక్షాలు
  • ఢిల్లీ స్థాయి రాజకీయ విమర్శలే ప్రధాన ప్రచారాస్త్రాలు

హైదరాబాద్, మహా : మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. అయితే ఓటర్ల కనీస అవసరాలైన డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి స్థానిక అంశాల కంటే రాష్ట్రస్థాయి రాజకీయ విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలంటేనే స్థానిక సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరు. కానీ, ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే, ఇది కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య పైచేయి సాధించే రాజకీయ కుస్తీగా మారిందన్న అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యంగా అజెండా సెట్ చేయడంలో అధికార కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకెళ్తుంటే, ప్రతిపక్షాలు ఆ ట్రాప్‌లో చిక్కుకున్నాయి.

బహిరంగసభల్లో రాజకీయమే మాట్లాడుతున్న రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో స్థానిక మున్సిపల్ సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ అంశాలనే హైలెట్ చేస్తున్నారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య బంధం, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ విపక్షా పార్టీలను డిఫెన్స్‌లో పడేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా రాజకీయ కోణంలోకి మళ్లించడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాల అమలుపై విపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తే జరిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేసుకున్న రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలే కేంద్రంగా మాట్లాడుతున్నారు. నిజామాబాద్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దీనివల్ల ఓటరు దృష్టి స్థానిక కౌన్సిలర్ పనితీరు కంటే రాష్ట్రస్థాయి రాజకీయాల వైపు మళ్లుతోంది.

ఇప్పటికే ట్రాప్‌లో పడిపోయిన విపక్షాలు

ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ సెట్ చేసే రాజకీయ ట్రాప్‌లో పడొద్దని, ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు స్థానిక సమస్యలను, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపాలని కోరారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి చేసే రాజకీయ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో స్థానిక అంశాలను హైలెట్ చేయడంలో విపక్షాలు విఫలమవుతున్నాయని, తద్వారా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా విసిరిన వలలో వారు చిక్కుకున్నారనే వాదనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షాలు అయిన బీఆర్ఎస్, బీజేపీ స్థానిక సమస్యలు, మున్సిపాలిటీల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను చర్చలోకి తీసుకురావడంలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయి. కేవలం ముఖ్యమంత్రిని విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఓటర్లు కూడా స్థానిక అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, పనితీరును గమనించడం మానేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలంటే ఉండాల్సిన గ్రౌండ్ లెవల్ అజెండా ప్రతిపక్షాల వద్ద కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల ఓటింగ్ ప్రయారిటీ ఏమిటి?

మున్సిపల్ ఎన్నికల ద్వారా తమ గల్లీలోని సమస్యలు తీరతాయని ఆశించిన ప్రజలకు, నేతల మధ్య సాగుతున్న రాజకీయమే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోకుండా ఇదే రాజకీయ ట్రాప్‌లో కొనసాగితే, అది అధికార పార్టీకి మరింత అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్థానిక అవసరాల కంటే, రాజకీయ బలబలాలను నిరూపించుకునే రిఫరెండంలా మారబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోపు విపక్షాలు కేటీఆర్ చెప్పినట్లుగా స్థానిక అజెండాను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలవు అనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలను అధిగమించి, ప్రజల కష్టాలను చర్చలోకి తీసుకువస్తేనే విపక్షాలకు మైలేజీ లభిస్తుంది. లేదంటే ఈ ఎన్నికలు కేవలం రాజకీయ రంగు పులుముకున్న వార్ లాగే మిగిలిపోతాయని భావించాల్సి ఉంటుంది.